10, 14 డివిజన్లలో స్వచ్ఛ సర్వేక్షన్
మచిలీపట్నం :
నగరాన్ని స్వచ్ఛ మచిలీపట్నంగా తీర్చిదిదేందుకు నగర ప్రజలు స్వచ్ఛ సైనికులుగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని 10, 14 డివిజన్ల మధ్యలో సుకర్లాబాద్ పోలీస్ కళ్యాణ మండపం సమీపంలో చెత్తాచెదారాలను, భవన వ్యర్థ సామాగ్రిని తొలగించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మచిలీపట్నం నగరాన్ని స్వచ్ఛ మచిలీపట్నంగా తీర్చిదిద్దే దిశలో ప్రతి డివిజన్ నుంచి ప్రజలు ముందుకు వచ్చి సైనికులుగా స్వచ్ఛందంగా స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. వీధుల్లో చాలామంది ప్రజలు చెత్తాచెదారాలను ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల వాతావరణం కలుషితమవుతుందన్నారు. ఏ వీధిలో నివసిస్తున్న ప్రజలు అదే వీధిని దత్తత తీసుకొని ప్రతి రోజు ఉదయం కనీసం 15 నిమిషాల పాటు చెత్తాచెదారాలను ఏరివేసి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆ విధంగా చేయడం వలన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికి తిరిగి చెత్త సేకరించడం, మురికి కాలువల్లో పూడికలు తొలగించడం వంటి పనులు సజావుగా చేసేందుకు వీలు కలుగుతుందన్నారు
ఇప్పటికే చాలామంది స్వచ్ఛ సైనికులు ముందుకు రావడం హర్షనీయమన్నారు. ప్రస్తుతం 10, 14 డివిజన్లలో కూడా కొంతమంది స్వచ్ఛ సైనికులుగా ఉంటామని ముందుకు వచ్చారని వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. గతంలో చెత్త చిదారాలను తొలగించాలంటే కొంత ఇబ్బంది పడే వారని, ప్రస్తుతము పట్టకార వంటి తేలికైన స్వచ్ఛ ఆయుధాన్ని వినూత్నంగా రూపొందించామని దాని ద్వారా సులభంగా ప్లాస్టిక్ వ్యర్ధాలు, చెత్తాచెదారాలు తొలగించవచ్చున్నారు. స్వచ్ఛ సైనికులుగా ముందుకు వచ్చే వారందరికీ మున్సిపాలిటీ నుండి స్వచ్ఛ ఆయుధాన్ని ఉచితంగా అందజేస్తున్నామన్నారు.
స్వచ్ఛ సైనికులుగా ముందుకు వచ్చేవారు వారి పేర్లను స్వచ్ఛ సైనికుల ఇంచార్జ్ డిటిడబ్ల్యు ఫణి ధూర్జటి సెల్ నెంబర్ కు సంప్రదించాలన్నారు. ఉదయాన్నే స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొంటే ఉచితంగా డి.. విటమిన్ ప్రతి ఒక్కరికి లభించడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారన్నారు. సమీపంలో కొన్ని మట్టి, చెత్త దిబ్బలు కనపడటంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ చెత్త దెబ్బలు మట్టి దెబ్బలు ఎక్కడ ఉంటే అక్కడ చెత్త వేయడం జరుగుతుందని వాటిని తొలగించి భూమి చదును చేసి రంగులు వేసి సుందరంగా తీసివేద్దామన్నారు. మరలా తాను వచ్చి చూస్తానని ,అప్పటికి అన్ని విధాల బాగుండేటట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ స్థానికంగా ముందుకు వచ్చిన స్వచ్ఛ సైనికులకు స్వచ్ఛ ఆయుధాలను ఉచితంగా పంపిణీ చేశారు. తదనంతరం స్థానికులు శర్మ మాట్లాడుతూ ఆఖరి మజిలీ స్మశాన వాటికలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. మూడు స్తంభాల సెంటర్ వద్ద ఉన్న ప్రధాన స్మశాన వాటిక ఆక్రమణకు గురైందని ఆక్రమణలు ప్రభుత్వం వారు తొలగించినట్లయితే మంచిగా అభివృద్ధి పరిచేందుకు తన వంతు సహకారం అందిస్తామని చెప్పడంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాలరావు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కిషోర్ కుమార్, కన్వీనర్ ముదిగొండ శాస్త్రి, మునిసిపల్ ఇంజనీర్లు కుబియా నాయక్ శేఖర్ రాంప్రసాద్ సచివాలయ కార్యదర్శులు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

