రాష్ట్రంలో నేర నియంత్రణలో కృష్ణాజిల్లా పోలీసుల ప్రతిభ
మచిలీపట్నం :
మహిళలపై నేరాల నియంత్రణ, శారీరక దాడుల నేరాల నియంత్రణలో రాష్ట్రంలో నెంబర్-1
సమగ్ర నేర నియంత్రణలో రాష్ట్రవ్యాప్తంగా 4వ స్థానం
రాష్ట్రవ్యాప్తంగా నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా భద్రత అంశాల్లో కృష్ణాజిల్లా పోలీస్ శాఖ మరోసారి తన ప్రత్యేక ప్రతిభను చాటుకుంది. శుక్రవారం అన్ని జిల్లా ఎస్పీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన 7 వ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కృష్ణాజిల్లా పోలీస్ శాఖ సమగ్ర నేరాల తగ్గింపులో రాష్ట్రంలోనే 4వ స్థానాన్ని సాధించగా, మహిళలపై జరిగే నేరాల తగ్గింపులో, శారీరక దాడులకు సంబంధించిన నేరాల నియంత్రణలో రాష్ట్రంలోనే నెంబర్-1 స్థానంలో నిలిచి విశేష గుర్తింపు పొందింది.

కృష్ణాజిల్లా పోలీస్ శాఖ యొక్క పనితీరును వారు చేసిన కృషిని గూర్చి రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పోలీస్ శాఖను, జిల్లా ఎస్పీ ని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కృష్ణాజిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా తీసుకుని, నేరాల నివారణకు ముందస్తు చర్యలు, నిరంతర పర్యవేక్షణ, సమర్థవంతమైన బీట్ వ్యవస్థ, మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటి అంశాల వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు, అవగాహన కార్యక్రమాలు, శక్తి టీం పర్యవేక్షణ, వేగవంతమైన స్పందన విధానం సమర్థవంతంగా అమలు చేయడం వల్ల మహిళలకు మరింత భద్రతా వాతావరణం కల్పించగలిగామని ఎస్పీ పేర్కొన్నారు. అలాగే శారీరక దాడులు, గొడవలు, ఇతర బాడిలీ ఆఫెన్సెస్ తగ్గించడంలో పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయడం విశేష ఫలితాలను ఇచ్చిందన్నారు.
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని, ఇదే స్పూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ సిద్ధంగా ఉంటుందని ఎస్పీ తెలిపారు. ప్రజల సహకారం, అప్రమత్తత, పోలీస్ శాఖపై నమ్మకం కూడా ఈ విజయాలకు ప్రధాన కారణమని , భవిష్యత్తులో కూడా నేరరహిత సమాజ నిర్మాణానికి కృష్ణాజిల్లా పోలీస్ శాఖ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు.

