ఢిల్లీ వరల్డ్ స్కూల్ కు అనుమతులు లేవు –డిఈఓ
మచిలీపట్నం :
కృష్ణాజిల్లా గూడూరు మండలంలో ఢిల్లీ వరల్డ్ స్కూల్ పేరుతో ప్రైవేట్ పాఠశాల సంబంధిత శాఖ నుండి సరైన గుర్తింపు, మరియు అనుమతులు పొందకుండా 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు చేపడుతున్నట్లు తెలిసిందని తల్లిదండ్రులు ఎవరు ఆ స్కూల్లో అడ్మిషన్ తీసుకుని ఇబ్బందులు పడవద్దని జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు పేర్కొన్నారు.
ఇప్పటికే సదరు స్కూల్ అనుమతులు లేకుండా వైడ్ పబ్లిసిటీ చేపడుతున్నట్లు తమ దృష్టిలో ఉందని జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా లేదా చట్టబద్ధ గుర్తింపు లేకుండా పాఠశాలల అడ్మిషన్లు చేపట్టడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమన్నారు. కావున ఢిల్లీ వరల్డ్ స్కూల్, గూడూరు పాఠశాలలో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావద్దని, ఒక వేళ విద్యార్ధులను గుర్తింపు లేని పాఠశాలలో జాయిన్ చేసిన యడల సదరు విద్యా సంవత్సరం విద్యార్థులు కోల్పోతారని, పిల్లలను ప్రైవేటు యాజమాన్యంలోని పాఠశాలలలోజాయిన్ చేసే ముందు తప్పనిసరిగా గుర్తింపు ఉన్న పాఠశాలల వివరాలను సంబంధిత మండల విద్యాశాఖాధికారి, ఉప- విద్యాశాఖాధికారి మరియు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల ద్వారా నిర్ధారించుకుని మాత్రమే అడ్మిషన్లు చేయాలని సూచించారు.
గుర్తింపు లేకుండా 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు నిర్వహిస్తున్న (CBSE / State Syllabus) ప్రైవేట్ పాఠశాలలపై, అలాగే అటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న నిర్వాహకులపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోబడతాయని జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు తెలియజేశారు.

