జిల్లా న్యాయ సేవాధికార సంస్థకే వన్నెతెచ్చిన న్యాయమూర్తి రామకృష్ణయ్య – కృష్ణా జిల్లా జడ్జి జి గోపి
మచిలీపట్నం:
కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి కె.వి రామకృష్ణయ్య మచిలీపట్నం నుండి కర్నూలు బదిలీ అయిన సందర్భంగా మచిలీపట్నం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కృష్ణా జిల్లా జడ్జి గోపి మాట్లాడుతూ గత 40 నెలలుగా కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రామకృష్ణయ్య విస్తృతమైన సేవలు అందించి పదవికే వన్నె తెచ్చారని అన్నారు. ఆయన హయాంలో కృష్ణా జిల్లాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చిందని అన్నారు. న్యాయ సేవాధికార సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలను చట్టం పట్ల అవగాహన క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందించడంలో రామకృష్ణయ్య విజయం సాధించారని అన్నారు. రామకృష్ణయ్య తో తన ఏడాది అనుబంధం సోదరా భావాన్ని పెంపొందించిందని గోపి అన్నారు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది అధికారం అంటే అజిమాషీ కాదని అధికారం అంటే సేవతో కూడిన సర్వీస్ అని అన్నారు. విజయవాడ తో సహా జిల్లాలోని అన్ని కారాగారాలను ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఖైదీల హక్కులు రక్షించడంలో రామకృష్ణయ్య ఎనలేని కృషి చేశారని అన్నారు.
కృష్ణాజిల్లాలో తాను చేసిన పదవీకాలం తన సర్వీసులో తీపి గుర్తుగా మిగిలిపోతుంది అని రామకృష్ణయ్య అన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ కృష్ణా జిల్లా ఎస్పీ న్యాయవాదులు న్యాయమూర్తులు అందించిన సహాయ సహకారాలతో గత నలభై నెలలుగా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ప్రతి ఒక్కరికి రామకృష్ణయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. న్యాయ సేవాధికార సంస్థ సేవలను ప్రజలకు చేరువటంలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇచ్చిన సహకారం మరువలేనిదని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి గాజుల వెంకటేశ్వర్లు, అదనపు సీనియర్ సివిల్ జడ్జి చదలవాడ యుగంధర్ , ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి సాయి సుధా, మొబైల్ మేజిస్ట్రేట్ జొన్నలపల్లి బాల త్రిపుర సుందరి దేవి, రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం. దేవస్థా దీపిక, సంస్థ సూపరింటెండెంట్ చిట్టూరి జయశ్రీ దేవి, మాజీ అదనపు పబ్లిక్ పాసిక్యూటర్ అడపా మురళి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఓ.ఎస్. కే శివకుమార్ పలువురు న్యాయవాదులు న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

