[addtoany]
మచిలీపట్నం :
ప్రజల నుంచి అందే అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వేగవంతంగా పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించారు. విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, సమగ్ర శిక్ష ఏపీసి ఆర్ కుముదిని సింగ్, అవనిగడ్డ డిఎస్పి ఆర్ అభిషేక్ తో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు.సంబంధిత శాఖలకు చేరిన అర్జీలను సమయపాలనతో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా సేవలు అందించాలని ఆయన తెలిపారు.
ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమంలో అర్జీల స్వీకరణ:
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ముందుగా ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ కే చంద్రశేఖరరావు ఉద్యోగుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ సమస్యలు, అభ్యర్థనలు వివరించగా, వాటిని పరిశీలించి సంబంధిత శాఖల ద్వారా త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని డీఆర్ఓ తెలిపారు.
*మీకోసం అర్జీల వివరాలు:*
ఇంతేరు గ్రామ స్మశానవాటిక భూమి రక్షణకు గ్రామస్థుల వినతి
కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామానికి చెందిన సర్వే నెం. 89లో ఉన్న స్మశానవాటిక భూమిని కొంతమంది అక్రమదారులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. భూ అక్రమదారులు ఆ స్థలంలో తవ్వకాలు చేపట్టగా, గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇంతకు ముందు రెవెన్యూ శాఖ సిబ్బంది స్మశానవాటికగా కొలతలు వేసి గ్రామానికి అప్పగించారని, గత 10 సంవత్సరాలుగా ఎటువంటి తవ్వకాలు జరగలేదని గ్రామస్థులు వివరించారు. ప్రస్తుతం అక్రమంగా దొంగపట్టాలు సృష్టించి భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అక్రమదారుల నుంచి స్మశానవాటిక భూమిని రక్షించి తిరిగి గ్రామానికి అప్పగించాలని గ్రామస్థులు అధికారులను కోరారు.
మురుగు కాలువ త్రవ్వకం, ఆక్రమణల తొలగింపుపై వినతి
పెదపట్నం పంట కాలువకు దిగువున ఉన్న ఆత్మాన్ కోడ్ మురుగు కాలువ రెవెన్యూ రికార్డుల ప్రకారం 30 అడుగుల వెడల్పు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 3 అడుగులకే పరిమితమైందని రైతులు తెలిపారు. కాలువపై ఆక్రమణలు జరగడంతో తుపాన్లు, భారీ వర్షాల సమయంలో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీరు సరిగా బయటకు వెళ్లక పంట భూములు ముంపుకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి మురుగు కాలువను పూర్తి స్థాయిలో త్రవ్వకం చేసి, ఎగువ దిగువ ప్రాంతాల రైతులకు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, కాలువపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని బంటుమిల్లి మండలం, మల్లేశ్వరం గ్రామానికి చెందిన కందుల శ్రీనివాసరావు అర్జీ సమర్పించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో డాక్టర్ జే అరుణ, ఆర్ అండ్ బి ఈఈ లోకేశ్వరరావు, ఉద్యాన శాఖ అధికారిణి జే జ్యోతి, మత్స్య శాఖ అధికారి అయ్య నాగరాజా, ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి, ఎల్డిఎం రవీంద్రారెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి చిన నరసింహులు, డ్రైనేజీ శాఖ ఈఈ కిరణ్, డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, గిరిజన, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు ఫణి ధూర్జటి, జి రమేష్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

