[addtoany]
మచిలీపట్నం :
రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించడం వైసిపికి ఏమాత్రం మింగుడు పడడం లేదని కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి అన్నారు.
నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు విషం కక్కుతున్నారన్నారు. వైసీపీ అధినేత తలా తోక లేని విధంగా వ్యవహరిస్తూ మావిగన్ పేరుతో రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. మచిలీపట్నం విజయవాడ గుంటూరు ప్రాంతాలను 2014లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఆర్డిఏ పరిధిలోకి తీసుకువచ్చారన్నారు. సి ఆర్ డి ఏ పరిధిలోకి తీసుకురావడం అంటే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని గురుమూర్తి చెప్పారు. కనీస అవగాహన లేనివిధంగా వైసిపి పార్టీ అధినేత, అలాగే పార్టీ నాయకులు వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు
రాజకీయ నటనలో కమల్ హాసన్ ను మించిపోతున్న మాజీ మంత్రి పేర్ని నాని రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకునే పనిలో ఉన్నారన్నారు. కనీస స్థాయిలేని వైసీపీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రపంచంలో ఒక్క వైసీపీ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు తప్ప మిగిలిన వారంతా రాష్ట్రానికి అమరావతి రాజధాని కావడం పట్ల హర్షిస్తున్నారన్నారు. ఐదేళ్ల వైసిపి పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసీపీ నాయకులు సిగ్గు శరం లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా సంక్షేమం అభివృద్ధి విషయంలో వెనకడుగు వేయకుండా పాలన చేస్తున్న కూటమి ప్రభుత్వంపై నిత్యం బురదజల్లే ప్రయత్నాలకు పాల్పడుతున్నారన్నారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన మంత్రి నారా లోకేష్ పై ఆరోపణలు చేయడం వారి విజ్ఞత లేని విధానాలకు నిదర్శనం గా పేర్కొన్నారు.తల్లకిందులుగా తపస్సు చేసినా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేరని రాజధాని అమరావతి విషయంలో వైసిపి నాయకుల చేష్టలు చిన్నపిల్లల బొమ్మలాటగా మారిందన్నారు.ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని మీకు మరోసారి బుద్ధి చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని గురుమూర్తి స్పష్టం చేశారు. 250 మందితో తెలుగుదేశం పార్టీ జాతీయ రాష్ట్ర కార్యవర్గాలను ఏర్పాటు చేస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి 30 మందికి అవకాశం లభించటం హర్షణీయమన్నారు. వీరంతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తారనే నమ్మకంతోనే పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.
ఇందుకుగాను కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ కార్యవర్గాల్లో నాయకులందరికీ అభినందనలు తెలియజేస్తున్నామన్నారు.
తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసిపి నాయకులు తట్టుకోలేక పోతున్నారన్నారు. అందుకనే చిన్న పెద్దా తేడా లేకుండా ఇష్టారాజ్యంగా వైసిపి నాయకులు మొరుగుతున్నారని పేర్కొన్నారు.అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని సమర్థవంతంగా నడిపించగల శక్తి సామర్థ్యాలు నారా లోకేష్ సంతరించు కున్నారన్నారు.తెలుగుదేశం పార్టీ జాతీయ రాష్ట్ర కార్యవర్గాల్లో చోటు దక్కించుకున్న జిల్లా నాయకులకు ఈ సందర్భంగా గోపు సత్యనారాయణ అభినందనలు తెలిపారు.
మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ రాష్ట్ర కార్యవర్గాల్లో చోటు దక్కించుకున్న అందరికీ అభినందనలు తెలిపారు.ఈ కార్యవర్గాల్లో జిల్లాకు పెద్దపీట వేశారని ఆయన పేర్కొన్నారు.మంత్రి కొల్లు రవీంద్ర కు మరోసారి పొలిట్ బ్యూరోగా అవకాశం కల్పించడం మాజీ పార్లమెంట్ సభ్యులు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుకు జాతీయ కోశాధికారి బాధ్యతలు అప్పగించడం మచిలీపట్నం కే గర్వకారణమన్నారు .ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోస్తా మురళి కృష్ణ, బత్తిన దాసు తదితరులు పాల్గొన్నారు.

