మీకోసం కార్యక్రమానికి మొత్తం 35 ఫిర్యాదులు
మచిలీపట్నం :
సామాన్య ప్రజలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనే వివిధ సమస్యలను చట్ట పరిధిలో త్వరితగతిన పరిష్కరించేందుకు మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “మీకోసం” కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారుల వద్ద నుండి రాతపూర్వక అర్జీలను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారుని తో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
భూమి వివాదాలు, కుటుంబ కలహాలు, మోసపూరిత ఘటనలు, సైబర్ నేరాలు, వేధింపులు తదితర వివిధ అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిపై పూర్తి స్థాయి విచారణ జరిపి, చట్టపరమైన పరిధిలో తగిన చర్యలు తీసుకుని పరిష్కారం అందించేందుకు కృష్ణా జిల్లా పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని, స్వీకరించిన ఫిర్యాదును సంబంధిత పోలీస్అధికారులకు బదిలీ చేసి వాటిపై పూర్తి విచారణ జరిపి పరిష్కారం చూపాల్సిందిగా ఎస్పి ఆదేశించారు. అలానే, ప్రజలు ఎటువంటి భయం లేదా సంకోచం లేకుండా తమకు ఎదురైన సమస్యలను పోలీసులకు తెలియజేయాలని ఎస్పీ సూచించారు. ప్రజా ఫిర్యాదుపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుని, మీకు సత్వర న్యాయం అందించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని హామీ ఇచ్చారు.