[addtoany]
మచిలీపట్నం :
జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, అర్జీలను వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ కుమార్ అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్ సమావేశపు మందిరంలో ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, బందరు డీఎస్పీ జి శ్రీనివాసరావు అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారి సమస్యలను సమయానికి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.
అర్జీలలో కొన్ని:
గుడివాడ మండలం, లింగవరం గ్రామానికి చెందిన కలపాల చిలకమ్మ పిజిఆర్ఎస్ సమావేశపు మందిరం వెలుపల అర్జీతో నిరీక్షిస్తున్న ఆమె సమస్యను జాయింట్ కలెక్టర్ స్వయంగా వెళ్లి అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో ఒక కాలు కోల్పోయానని, ప్రస్తుతం ప్లాస్టిక్ కాలు పరికరం సహాయంతో జీవనం సాగిస్తున్నానని, పింఛను ఇప్పించాలని కోరగా, ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే పింఛను మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఆమెకు తక్షణమే మూడు చక్రాల సైకిల్ ను మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
భారత రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వెట్టిచాకిరి చేయించుకుంటూ ఎల్పిజి గ్యాస్ డీలర్ల వద్ద పని చేసే కార్మికులకు గ్యాస్ కంపెనీ డీలర్లు వేతనాలు ఇవ్వడం లేదని, ఆయా డీలర్లపై సమగ్ర విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని మచిలీపట్నం పట్టణ పౌర సంక్షేమ సంఘం టౌన్ కన్వీనర్ కొడాలి శర్మ అర్జెంటు సమర్పించారు.
గన్నవరం మండలం, వెదురుపావులూరు గ్రామ రెవెన్యూ పరిధిలో దాదాపు 3,500 ఎకరాలలో జొన్న, మొక్కజొన్న పంట సాగై ఉందని, దళారులు మద్దతు ధర కన్నా తక్కువకు కొనుగోలు చేస్తున్నారని జరుగుతున్న నష్టాన్ని వివరిస్తూ, ఆ ప్రాంతంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామానికి చెందిన పాలడుగు రత్నారావు తదితర రైతులు కోరారు.
కార్యక్రమంలో డిపిఓ జె అరుణ, ఆర్ అండ్ బి ఈఈ లోకేశ్వరరావు, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారిణిలు ఎన్ పద్మావతి, జే జ్యోతి, డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్, మత్స్య శాఖ అధికారి అయ్య నాగరాజు, జిల్లా సహకార అధికారి చంద్రశేఖర్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి శివరాం ప్రసాద్, ఎల్డిఎం రవీంద్రారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ అధికారి సోమశేఖర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

