[addtoany]
మచిలీపట్నం :
జిల్లాలోని మహిళా వ్యాపారవేత్తలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు అన్ని విధాలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో కొనుగోలుదారులు… అమ్మకందారుల సమ్మేళనం అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళ వ్యాపారవేత్తలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే క్రమంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
ప్రతి మహిళా వ్యాపారవేత్తకు సంబంధించి ఇంస్టాగ్రామ్ ఖాతాను తెరిపించాలని, ఇప్పటికే 78 మందికి తెరిపించడం జరిగిందని, మిగిలిన వారందరికీ కూడా ఇంస్టాగ్రామ్ ఖాతాను తెరిపించి అందులో ఏ విధంగా ఉత్పత్తుల వివరాలు పోస్టింగ్ చేయాలో అవగాహన కల్పించాలన్నారు. డిజిటల్ మార్కెటింగ్ లో కూడా వారికి శిక్షణ ఇవ్వాలన్నారు.
విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులను సంప్రదించి వారి కార్యాలయం వద్ద కూడా ఎస్ హెచ్ జి మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శించేలా చూడాలన్నారు. హోటల్ సంఘాలు, యజమానులతో మాట్లాడి ఎస్ హెచ్ జి వ్యాపారవేత్తలు తయారుచేసిన పచ్చళ్ళు, ఊరగాయలు వంటి ఉత్పత్తులను అమ్ముకునే ఏర్పాటు చేయాలన్నారు.
ఆవకాయ డాట్ కాం యాజమాన్యంతో కూడా మాట్లాడి ఎస్ హెచ్ జి వ్యాపారవేత్తలను అనుసంధానం
చేయడంతో పాటు వారికి వచ్చిన ఆర్డర్లను ఏ విధంగా బట్వాడా చేయాలి, నాణ్యతా ప్రమాణాలు విధిగా పాటించడంలో ఒక ప్రణాళిక ఉండేలా చూడాలన్నారు.
పీఎంఈజీపి, పిఎం ఎఫ్ఎంఈ తదితర రుణాల కోసం వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి రుణాలు మంజూరు చేసి యూనిట్లు నెలకొల్పేందుకు చొరవ చూపాలన్నారు.
ఆసక్తి కలవారికి టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు కూడా పి..ఫోర్ బంగారు కుటుంబాలు మార్గదర్శి ద్వారా విరాళంగా అందజేసి వివిధ రకాల గుడ్డల సంచులు తయారీకి సిద్ధం చేయాలన్నారు.
సామాజిక మాధ్యమాల ను ప్రభావితం చేసే వారిని కూడా సంప్రదించి వారి ద్వారా మహిళ వ్యాపారవేత్తల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు తయారుచేసిన వివిధ రకాల ఉత్పత్తులను మరింతగా ప్రోత్సహించేందుకు ఇదివరకు నిర్వహించిన విధంగా సరస్ మేళాలు ఏర్పాటు చేసేందుకు చొరవ చూపాలన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ కల్పన, డిఆర్ఓ చంద్రశేఖర రావు, డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, శిక్షణలో ఉన్న ఉప కలెక్టర్ నిఖిల, ఎల్డీఎం రవీంద్రారెడ్డి, డిఐసి జిఎం వెంకటరావు, జిల్లా ఉద్యాన అధికారి జే జ్యోతి, ఆహార భద్రత అధికారి గోపాలకృష్ణ, ఎన్ఐసి ఏ డి ఐ ఓ సెల్వినా తదితర అధికారులు పాల్గొన్నారు.

