మచిలీపట్నం:
జిల్లాలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న 30 విచారణ కేసులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడుతో కలిసి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించి డివిజన్ వారీగా క్రిమినల్ కేసుల స్థితిగతులను సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 10 వ అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రత్యేక సెషన్స్ కోర్టులో మొత్తం 397 క్రిమినల్ కేసులు ఉండగా అందులో ఇప్పటివరకు 104 కేసులు పరిష్కారం అయ్యాయని, ఇంకనూ 293 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు.
పెండింగ్ లో ఉన్న 293 కేసులు 2015 సంవత్సరం నుండి ఇప్పటివరకు ఉన్నాయన్నారు. అందులో విచారణ క్రింద 30 కేసులు, పెండింగ్ ట్రయల్ లో 220 కేసులు ఉన్నాయన్నారు. పెండింగ్లో ఉన్న కేసులు అన్నిటిని సత్వరమే పరిష్కరించేందుకు అధికారులందరూ ప్రత్యేక చొరవతో తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలో 47 కేసులకు సంబంధించి 58 మంది బాధితులకు 1,04,83,750 రూపాయలను నష్టపరిహారం కింద మంజూరు చేయగా అందులో 31 మంది బాధితులకుకి బడ్జెట్ ఉన్నంత మేరకు 66,22,982 రూపాయలు చెల్లించడం జరిగిందని ఇంకనూ 27 మంది బాధితులకు దాదాపు 40 లక్షల రూపాయలు అవసరం ఉందని ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగిందన్నారు.
ఎస్సీ ఎస్టీలకు ఎవరికైనా జీవనోపాదుల కోసం బ్యాంకు రుణాలు అవసరమైతే పీఎంఈజీపీ కింద దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కమిటీ సభ్యులకు తెలిపారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, మచిలీపట్నం ఆర్డిఓ సాంబశివరావు, గన్నవరం, అవనిగడ్డ డిఎస్పీలు శ్రీనివాసరావు లు, డిఐసి జీఎం వెంకటరావు, ఏపిపీ వెంకన్న బాబు, కమిటీ సభ్యులు పరుచూరి వెంకటేశ్వరరావు,మహమ్మద్ బాజీ, రామదేను వేణు, గుమ్మడి విద్యాసాగర్, కొండా నాగేశ్వరరావు, నరేష్ కుమార్, విజయబాబు, ఏఎస్ డబ్ల్యూ ఓ లు మల్లేశ్వరి, రాంబాబు, మోహన్ రావు, పర్వీన్ సుల్తానా తదితర అధికారులు పాల్గొన్నారు.