జిల్లాలోని దివ్యాంగులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుని జీవితంలో పైకి ఎదగాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు.
బుధవారం మధ్యాహ్నం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నగరంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో దివ్యాంగులకు ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివ్యాంగుల యోగక్షేమాలను, పింఛను వస్తుందా లేదా అని అడిగి తెలుసుకుంటూ వారికి భోజనం స్వయంగా వడ్డించి వారితో కలిసి భుజించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగశక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులందరూ సద్వినియోగం చేసుకొని వారి జీవనోపాదులను మెరుగుపరుచుకోవాలన్నారు. ఎవరికైనా ఉపాధి కోసం ఆర్థిక సహాయం కావాలంటే సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు, వయోవృద్ధులు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడి కామరాజు, పర్యవేక్షకులు ప్రశాంతి, విహెచ్పిఎస్ సంఘం అధ్యక్షురాలు స్వాతి నాయుడు, హెచ్ హెచ్ సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు.