మచిలీపట్నం :
జిల్లాలో మంజూరైన పరిశ్రమల యూనిట్లను సత్వరమే నెలకొల్పుటకు ఎదురవుతున్న అడ్డంకులను వెంటనే తొలగించేందుకు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో పరిశ్రమల అధికారులు, ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించి మంజూరైన 230 పరిశ్రమల యూనిట్ల పురోగతిపై యూనిట్ల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మల్లవల్లి పారిశ్రామిక వాడలో మంజూరై ఇంకా నెలకొల్పకుండా ఉన్న పరిశ్రమల యూనిట్లకు అవసరమైన విద్యుత్ కనెక్షన్లు, ప్రణాళిక ఆమోదాలు, రిజిస్ట్రేషన్లు తదితర అన్ని రకాల సౌకర్యాలను వెంటనే కల్పించి యూనిట్లు నెలకొల్పేందుకు కృషి చేయాలన్నారు. ఇంకా ఎందుకు యూనిట్లు ప్రారంభించలేదు వివరాలు అడిగి తెలుసుకుని వెంటనే మొదలు పెట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
మంజూరైన యూనిట్లకు సంబంధించి ఏమేమి అనుమతులు ఇచ్చారో అటువంటి విషయాలను వెంటనే సంబంధిత పారిశ్రామికవేత్తలకు తెలియజేసి యూనిట్లు నెలకొల్పేందుకు ప్రోత్సహించాలన్నారు. పారిశ్రామికవేత్తలకు ఏ సమస్య ఉన్న వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. అన్ని విధాలుగా సహకరిస్తున్నప్పటికీ ఇంకను యూనిట్లు నెలకొల్పుటకు ముందుకు రాకపోతే అటువంటి పారిశ్రామికవేత్తలకు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. వచ్చే సమావేశంలోగానైనా మరింత పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం ఆర్ వెంకటరావు,ఏపీఐఐసీ జడ్ ఎం బాబ్జి, ప్రత్యేక అధికారులు జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, మార్కెటింగ్ ఏడి నిత్యానందం, డి సి ఓ చంద్రశేఖరు, మార్క్ఫెడ్ డి ఎం మురళీకృష్ణ, జిల్లా ఉద్యాన అధికారి జే. జ్యోతి, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి వెంకటరావు, లీడ్ బ్యాంకు మేనేజర్ రవీంద్రారెడ్డి, గనులు భూగర్భ శాఖ ఏజి కొండారెడ్డి, డి ఎల్ డి వో లు సునీత శర్మ, రాజేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.