మచిలీపట్నం :
సైన్స్ డే సందర్భంగా నగరంలోని పలు విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్లు విద్యార్థులను ఆలోచింపజేశాయి. ఆయా విద్యాసంస్థల్లోని విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్ట్స్ ఆకట్టుకున్నాయి.
నగరంలోని జవ్వారుపేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు దాదాపు 200 ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. వీటిలో ముఖ్యంగా సైన్సు, సాంకేతిక, ఆహార, పర్యావరణ పరిరక్షణ, ఏఐ, రోబోటిక్, టైమ్ అండ్ డిస్టెన్స్ మిషన్ వంటి ప్రాజెక్టులు విద్యార్థులను ఆలోచింపజేశాయి.
ఈ సైన్స్ ఎగ్జిబిషన్ను హిందూ అనుబంధ విద్యా సంస్థల కమిటీ సభ్యులు దింటకుర్తి ప్రసాద్, డైరెక్టర్ డాక్టర్ టి అన్నపూర్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత అధునాతన యుగంలో సైన్స్ కు మరింత ప్రాధాన్యత పెరిగిందని విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అలాగే స్కూల్లో ఎల్కేజీ యూకేజీ చదువుతున్న చిన్నారులతో ఎక్స్ ప్రొసీవ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్ ఈ ఈ ఎల్ ఎల్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా చిన్నారులు పలు పళ్ళు, కాయలు, కూరగాయలు తదితర వేషధారణలో వాటి ప్రాధాన్యతను ఇంగ్లీషులో వివరించారు. ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులను స్కూల్ ప్రిన్సిపల్ ఎం సత్యనారాయణ అభినందించారు కార్యక్రమాలను హిందూ విద్యా సంస్థల ప్రిన్సిపల్స్ స్కూల్ ఉపాధ్యాయులు సిబ్బంది పర్యవేక్షించారు.