మచిలీపట్నం:
నిత్యం అప్రమత్తంగా ఉంటూ రహదారి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. రోడ్డు ప్రమాదాల స్థితిగతులు, జాతీయ, రాష్ట్ర రహదారులపై బ్లాక్ స్పాట్లకు తీసుకున్న చర్యలు తదితర అజెండా అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. గత సమావేశంలో గుర్తించిన సమస్యలకు అధికారులు పరిష్కరించిన అంశాలను ఒక్కొక్కటిగా ఆయన ఈ సందర్భంగా ఆరా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి ప్రమాదాలను అరికట్టటం ప్రతి ఒక్క అధికారి బాధ్యత అని, ప్రమాదాలకు కారణమయ్యే బ్లాక్ స్పాట్లను ఎప్పటికప్పుడు గుర్తించి తక్షణ పరిష్కారం చేపట్టడం ద్వారా ప్రమాదాలకు అవకాశం లేకుండా ఉంటుందన్నారు.
జాతీయ రహదారులకు చేరుకునే 28 ప్రాంతాలలోని అప్రోచ్ రహదారులకు అత్యవసరంగా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని గత సమావేశంలో ఆదేశించిన నేపథ్యంలో, ప్రస్తుతం ఐదు పూర్తి చేసి మార్కింగ్ చేశామని సంబంధిత అధికారులు కలెక్టర్ కి వివరించగా, మిగిలినవి త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు.
వాహనాల వేగ నియంత్రణ కోసం జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన డ్రమ్ములు రాత్రి సమయాలలో వాహన చోదకులకు సరిగా కనబడకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, డ్రమ్ములకు పూర్తిస్థాయిలో రేడియం స్టిక్కర్లు అతికించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా జాతీయ రహదారులపై పయనించే ఆర్టీసీ బస్సులకు జిపిఎస్ పరికరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై ఉన్న కాలినడక వంతెనలకు (ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్) రాజకీయ నాయకులు, ఇతర ప్రకటనలకు సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరల ఏర్పాటు చేయకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
సమావేశంలో అదనపు ఎస్పీ వి నాయుడు, జిల్లా రవాణా అధికారి ఎన్ యు ఎన్ ఎస్ శ్రీనివాస్, భారత జాతీయ రహదారుల అధికార సంస్థ పిడి విద్యాసాగర్, జిల్లా ప్రజారవాణా అధికారి వెంకటేశ్వర్లు, రహదారులు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లోకేశ్వరరావు, ఇంచార్జ్ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వెంకట్రావు, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, రాష్ట్ర రహదారులు, పోలీసు, రెవిన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.