MachilipatnamLocal News
January 14, 2026
కృష్ణా జిల్లా

ఆత్మనిర్భర్ భారత్ నినాదం సాకారం దిశగా దేశ మైనింగ్ రంగం అభివృద్ధి చేసుకుందాం

  • January 9, 2026
  • 1 min read
[addtoany]
ఆత్మనిర్భర్ భారత్ నినాదం సాకారం దిశగా దేశ మైనింగ్ రంగం అభివృద్ధి చేసుకుందాం
– మైనింగ్ రంగంలో ప్రపంచ దేశాలపై ఆధారపడే పరిస్థితిని మారుద్దాం
– క్రిటికల్ మినరల్స్‌ రంగంలో వేల్యూ యాడెడ్ పరిశ్రమలు రావాలి
– ఏపీ ఇసుక నిర్వహణ వ్యవస్థకు ‘స్కాచ్ సిల్వర్ అవార్డు’ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం
– గుజరాత్‌లో నిర్వహించిన రాష్ట్రీయ ఖనిజ చింతన 2026లో మంత్రి కొల్లు రవీంద్ర.
 
మచిలీపట్నం :
 
 దేశానికి అవసరమైన క్రిటికల్ మినరల్స్ కోసం ప్రపంచంపై ఆధారపడకుండా ఇక్కడే తయారు చేసుకున్నపుడే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన స్వయం సమృద్ధి, ఆత్మనిర్భర్ భారత్ నినాదం సాకారం చేసుకునే అవకాశం కలుగుతుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జాతీయ మైనింగ్ మంత్రుల కాన్ఫరెన్స్- Rastriya Khanij Chintan shivir-2026లో కేంద్ర గనులు మరియు బొగ్గు శాఖ మంత్రి వర్యులు జి.కిషన్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్నారు. 
 
కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన సమయంలో, మైనింగ్ రంగం అనేక సవాళ్లు ఎదురయ్యాయి. గనుల శాఖ సామర్ధ్యాన్ని పెంచడంతో పాటుగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూనే ఆదాయం పెందచేందుకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. 2025–26 ఆర్ధిక సంవత్సరంలో 41 ప్రధాన ఖనిజ బ్లాకులకు NITలను జారీ చేశాం. 10 ప్రధాన ఖనిజ బ్లాకులను విజయవంతంగా వేలం నిర్వహించాం. 2015 తర్వాత ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంత మొత్తంలో వేలం నిర్వహించడం ఇదే. ఏప్రిల్ 2025లో ‘ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ పాలసీ’ని తీసుకొచ్చాం. ఇందులో భాగంగా.. వేలం మరియు దరఖాస్తు విధానం ఒకేసారి అమలు చేయడం, ప్రీమియం చెల్లింపులకు వాయిదా పద్ధతి, లీజు కాలపరిమితి పెంపు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పెనాల్టీ కేసుల కోసం ‘వన్-టైమ్ సెటిల్మెంట్’ (OTS) విధానం, ఆన్ లైన్ ద్వారా లీజు ప్రక్రియ మొత్తం నిర్వహించడం, వ్యర్థ పదార్థాల పునర్వినియోగానికి ప్రోత్సాహకాలు అందించడం వంటి సంస్కరణలు తీసుకొచ్చాం.
 
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ‘ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేశాం. నిర్వహణ ఖర్చులను మాత్రమే వసూలు చేస్తూ ఇప్పటి వరకు 200 లక్షల టన్నులకు పైగా ఇసుకను అందించాం. దీనివల్ల సామాన్యులకు ఇసుక అందుబాటులోకి రావడంతో భవన నిర్మాణ రంగం బలోపేతమైంది. ఏపీ ఇసుక నిర్వహణ వ్యవస్థకు ఉత్తమ పాలన విభాగంలో ‘SKOCH సిల్వర్ అవార్డు’ లభించడం కూటమి ప్రభుత్వ నిర్ణయాలకు నిదర్శనం.రాష్ట్ర స్థూల విలువ జోడింపు (GVA)లో మైనింగ్ రంగం వాటా 1.83 శాతం నుండి 2.41 శాతానికి పెరిగింది. ఇది ఖనిజ అభివృద్ధిలో ప్రభుత్వ పారదర్శకమైన విధానాలకు నిలువుటద్దం. ఈ నేపథ్యంలో, మైనింగ్ రంగంలో జాతీయ ప్రాధాన్యతలను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ‘నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్’ రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎలక్ట్రానిక్స్ మరియు రక్షణ రంగాలకు అవసరమైన ఖనిజాలపై భారతదేశం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతర్జాతీయంగా క్రిటికల్ మినరల్స్ సరఫరాలో ప్రస్తుతం చైనా అగ్రస్థానంలో ఉంది. అందువలన మన దేశంలో ఉన్న అపారమైన ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దేశీయంగా మైనింగ్ నిర్వహణ, ప్రాసెసింగ్ విలువ జోడింపు ప్రక్రియలపై దృష్టి పెట్టడం అత్యంత అవసరం.  
 
భారతదేశ తీరప్రాంత ఇసుక ఖనిజ వనరులలో మూడవ వంతు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ప్రాసెసింగ్ పార్కును ప్రకటించడం అభినందనీయం. ముడిసరుకు లభ్యత, ఓడరేవుల సౌకర్యాలు మరియు ఎదుగుతున్న పారిశ్రామిక క్లస్టర్లను పరిగణనలోకి తీసుకుని, మచిలీపట్నంలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ మరియు వ్యూహాత్మక నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వినమ్రంగా కోరుతున్నాం. మేకిన్ ఇండియా నినాదంతో ముందుకు వెళ్తున్న మన దేశానికి ఈ నిర్ణయం అత్యంత ప్రోత్సాహకరంగా నిలుస్తుంది.  
 
ముఖ్యంగా లోతైన ఖనిజాల విషయంలో అన్వేషణ మరియు ప్రాసెసింగ్ సంయుక్తంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. కొత్త ఖనిజాలను చేర్చడం, లీజు విస్తీర్ణాన్ని ఒకసారి పొడిగించడం మరియు కొన్ని ముందస్తు అనుమతులను తొలగించడం వంటి నిర్ణయాలు అత్యుత్తమ ఫలితాలు అందిస్తాయి. మైనింగ్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటు కూడా మరింత తోడుగా నిలుస్తుందని భావిస్తున్నాను. అధిక గ్రేడ్ ఖనిజాలు తగ్గిపోతున్న తరుణంలో ప్రాసెసింగ్ సాంకేతికతలే కీలక మార్పులను తెస్తాయి. కాబట్టి, మైనింగ్ విధానంలో ‘విలువ జోడింపు’ కేంద్ర బిందువుగా ఉండాలి. 
 
ఈ సందర్భంగా రాష్ట్రంలో వేల్యూ యాడెడ్ పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టే ఏజెన్సీలకు, ప్రధాన ఖనిజాల వేలంలో ‘రైట్ ఆఫ్ ఫస్ట్ రిఫ్యూజల్’ (Right of First Refusal) కల్పించే అంశాన్ని తగిన రక్షణలతో పరిశీలించవలసినదిగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. గనుల వేలం వేయడం మాత్రమే కాకుండా, అవి ఉత్పత్తి దశకు చేరుకున్నప్పుడే అసలైన ఫలితం ఉంటుంది. అనుమతులను వేగవంతం చేయడానికి గనుల నిర్వహణను సులభతరం చేయడానికి బలమైన ‘సింగిల్ విండో డిజిటల్ సిస్టమ్’ అవసరం. దేశ వ్యాప్తంగా నిలిచిపోయిన గనుల (Non-operational leases) విషయంలో ఆచరణాత్మకమైన మరియు సానుకూల దృక్పథంతో వ్యవహరించడం ముఖ్యం. మైనింగ్ కార్యకలాపాలకు వివిధ అనుమతులు, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వనరులు ప్లాంట్ సంసిద్ధత అవసరం. నిలిచిపోయిన గనులను పునరుద్ధరించడానికి ప్రస్తుతం ఉన్న ఒక ఏడాది సడలింపును రద్దు చేయాలని కేంద్ర గనుల శాఖ ప్రతిపాదించినట్లు తెలిసింది. అందుకు బదులుగా, గనులు ఎందుకు నిలిచిపోయాయనే అంశాన్ని కేసుల వారీగా పరిశీలించి, వాటిని పునరుద్ధరించడానికి ఒక కార్యాచరణను రూపొందించడం మెరుగైన ఉత్పత్తికి తోడ్పాటు అందించినట్లు అవుతుందని భావిస్తున్నాను. 
 
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంతో పని చేస్తే.. ప్రస్తుతం ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంతో పాలనలో పారదర్శకత, వేగం పెంచారని చెప్పడానికి గర్వంగా ఉంది. రాబోయే మూడేళ్లలో గరిష్టంగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించి, 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో పని చేస్తున్నాం. 2025-26లో భారతదేశానికి వచ్చిన మొత్తం ఎఫ్‌డిఐ (FDI)లలో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే వచ్చినట్లు ఇటీవల ఫోర్బ్స్ నివేదిక పేర్కొనడం ఏపీ ప్రభుత్వంపై ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకానికి నిదర్శనం.
 
కార్యక్రమంలో కేంద్ర గనులు మరియు బొగ్గు శాఖ మంత్రి వర్యులు జి.కిషన్ రెడ్డి , గనుల శాఖ కార్యదర్శి పీయూష్ గోయల్ , వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన మంత్రులు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *