మచిలీపట్నం ప్రతినిధి:
ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనం నిర్మాణంపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మచిలీపట్నంలో ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనం నిర్మాణానికి సంబంధించి ఆయన విగ్రహము, కన్వెన్షన్ హాలు, వైజ్ఞానిక ప్రదర్శనశాల, డిజిటల్ గ్రంధాలయము, విద్యా, ఆరోగ్య, సాంస్కృతిక విభాగాలను, యూనియన్ బ్యాంకు పరి పరిపాలన భవనం నిర్మించాల్సి ఉందన్నారు.
ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గత నెల 31వ తేదీన సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారన్నారు.
భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనం నిర్మాణానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసి అందజేయాలన్నారు.
అలాగే నూతనంగా ఏర్పాటు చేస్తున్న భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక ట్రస్ట్ విధివిధానాలను కూడా పకడ్బందీగా రూపొందించాలన్నారు.
ప్రతిపాదిత 2 ఎకరాల స్థలంలో 1.50 ఎకరాలు ట్రస్ట్ పేరిట, 50 సెంట్లు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా పేరిట అలినేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ మేనేజర్ కె వెంకటరావు, మచిలీపట్నం ఇన్చార్జి ఆర్డిఓ పోతురాజు, జిల్లా పర్యాటక అధికారి రామ్ లక్ష్మణ్, మునిసిపల్ సహాయ కమిషనర్ గోపాలరావు, సమాచార పౌర సంబంధాల శాఖ డిడి వెంకటేశ్వర ప్రసాద్, మచిలీపట్నం తహసిల్దార్ నాగభూషణం తదితర అధికారులు పాల్గొన్నారు.