పకడ్బందీ పోలీసింగ్‌కు ఆధునిక సాంకేతికత కీలకం: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
మచిలీపట్నం:
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసింగ్‌లో సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా శాంతిభద్రతల పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణ, నేర నియంత్రణ మరింత వేగవంతమవుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. గురువారం మచిలీపట్నంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో నూతనంగా నిర్మించిన కృష్ణా జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన కమాండ్ సెంటర్లను ఆర్టీజీఎస్ వ్యవస్థకు అనుసంధానించామన్నారు. జిల్లాల్లోని సీసీ కెమెరాలు, డ్రోన్లు, పోలీసు సిబ్బంది కదలికలను కమాండ్ సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షించి, అత్యవసర సమయాల్లో బలగాలను తక్షణమే మళ్లించవచ్చని తెలిపారు.
కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు రూపొందించిన ‘త్రినేత్ర’ యాప్‌ను డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికల బందోబస్తును ప్రశాంతంగా నిర్వహించినందుకు కలెక్టర్, ఎస్పీతో పాటు పోలీసు సిబ్బందిని ప్రశంసించారు. సైబర్ నేరాల దర్యాప్తు కోసం ప్రతి జిల్లాలో 20 మందితో ప్రత్యేక ‘క్లిక్’ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నేర పరిశోధనలో ఏఐ, ఫోరెన్సిక్ సాంకేతికతను విస్తృతంగా వాడుతున్నామని, నూతన క్రిమినల్ చట్టాల అమలులో రాష్ట్ర కన్విక్షన్ రేటు 86 శాతానికి చేరిందని వెల్లడించారు.
తొలుత జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కమాండ్ సెంటర్ పనితీరును ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించారు. ఒకేసారి 36 స్క్రీన్లపై వివిధ ప్రాంతాల దృశ్యాలను, 30 డ్రోన్లను పర్యవేక్షించే సామర్థ్యం ఈ కేంద్రానికి ఉందన్నారు. త్రినేత్ర యాప్ ద్వారా సిబ్బంది కదలికల గుర్తింపు, అత్యవసర సమయాల్లో ఎస్ఓఎస్ అలర్ట్‌లు అందుతాయని తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఏలూరు ఎస్పీ కే ప్రతాప్ శివ కిషోర్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ నమ్రత అగర్వాల్, అదనపు ఎస్పీ వీవీ నాయుడు, మచిలీపట్నం, అవనిగడ్డ, గన్నవరం డీఎస్పీలు ఏ శ్రీనివాసరావు, అభిషేక్, పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

