గ్రామ పంచాయతీ ఎన్నికలు: ఏకగ్రీవ పంచాయతీలకు భారీగా పెరిగిన ప్రోత్సాహక నగదు బహుమతి – రూ.15 లక్షల నుండి రూ.50 లక్షల వరకు పెంపు!
మచిలీపట్నం:
కృష్ణా జిల్లాలో 2026 రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ మరియు అన్ని వార్డు సభ్యుల పదవులకు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గ్రామాల్లో ఐక్యత, సామరస్యం, మరియు సోదరభావాన్ని పెంపొందించేందుకు, రాజకీయ వివాదాలకు తావులేకుండా ఏకగ్రీవాలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రోత్సాహక నగదు బహుమతులను గణనీయంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లా ఎన్నికల అధికారి & కలెక్టర్ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా జీ.ఓ.ఆర్.టి. నెం.1111, తేదీ 13.11.2026 ద్వారా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నూతన ప్రోత్సాహక పథకం 2026లో జరగనున్న రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రమే వర్తిస్తుంది.
ప్రోత్సాహక నగదు వివరాలు:
గ్రామ పంచాయతీల జనాభా ప్రాతిపదికన ప్రోత్సాహక మొత్తాలను ప్రభుత్వం గణనీయంగా పెంచింది. గతంలో 2,000 లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.5.00 లక్షలు ఉండగా, ప్రస్తుతం దానిని రూ.15.00 లక్షలకు పెంచారు. అలాగే 2,001 నుండి 5,000 వరకు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు గతంలో ఉన్న రూ.10.00 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రస్తుతం రూ.15.00 లక్షలకు పెంచడం జరిగింది. ఇక 5,001 నుండి 10,000 వరకు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు గతంలో రూ.15.00 లక్షలు ఉండే ప్రోత్సాహక నగదును ప్రస్తుతం రూ.25.00 లక్షలకు పెంచారు. అత్యధికంగా 10,000 పైనబడి జనాభా కలిగిన గ్రామ పంచాయతీలకు గతంలో రూ.20.00 లక్షలు ఉండగా, ప్రస్తుతం దానిని భారీగా పెంచి రూ.50.00 లక్షల ప్రోత్సాహక నగదును అందజేయనున్నారు.
ముఖ్యమైన నిబంధనలు మరియు అర్హతలు:
పూర్తి ఏకగ్రీవం: సంబంధిత గ్రామ పంచాయతీలో సర్పంచ్ మరియు అన్ని వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు ఏకగ్రీవంగా జరగాలి. కేవలం సర్పంచ్ పదవికి మాత్రమే ఏకగ్రీవం జరిగితే ఈ ప్రోత్సాహకానికి అర్హత ఉండదు.
అధికారిక ప్రకటన: సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికలు నిబంధనలకు అనుగుణంగా జరిగినట్లు సంబంధిత సమర్థ ఎన్నికల అధికారులు అధికారికంగా ఏకగ్రీవంగా ప్రకటించాలి.
నిధుల వినియోగం: మంజూరైన ప్రోత్సాహక మొత్తాన్ని సంబంధిత గ్రామ పంచాయతీ పరిధిలో అమాయించబడిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సంక్షేమ పనులకే పూర్తిగా వినియోగించాలి.
దశలవారీ విడుదల: ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పదవులలో ప్రోత్సాహక మొత్తాన్ని దశలవారీగా విడుదల చేయడం జరుగుతుంది.
ఓటు హక్కుకు భంగం లేదు: ఈ పథకం ద్వారా ఏ అర్హత కలిగిన వ్యక్తి అయినా ఎన్నుకునే హక్కు లేదా ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకునే హక్కుకు ఎలాంటి ఆటంకం కలగకూడదు.
గ్రామ పంచాయతీలలో పరస్పర ఐక్యత, సోదరభావం, సామరస్యం సాధించేలా ప్రజలందరూ సమష్టిగా కృషి చేసి, ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ ఎన్నికల ప్రక్రియలో స్వచ్ఛందంగా పాల్గొనాలని అధికారులు కోరారు.

