రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో చలానా వివరాల నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలి
* జిల్లా జాయింట్ కలెక్టర్‌కు బీసీ సంక్షేమ సంఘం నాయకుల వినతి
* ప్రభుత్వ రుసుములపై ప్రజలకు స్పష్టత కల్పించాలని డిమాండ్
మచిలీపట్నం:
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించేందుకు వీలుగా ప్రతి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో చలానా వివరాలతో కూడిన ప్రత్యేక నోటీసు బోర్డులను ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శేకుబోయిన సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సంఘ నాయకులు జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా శేకుబోయిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజలకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా వివరాలు, రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇతర రుసుములపై పూర్తి అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కార్యాలయ ఆవరణలో ప్రజలకు స్పష్టంగా కనిపించే చోట ప్రభుత్వ రుసుముల వివరాలను ప్రదర్శించడం వల్ల ప్రక్రియపై పూర్తి స్పష్టత ఏర్పడుతుందని తెలిపారు. దీనివల్ల ప్రజలు తాము ముందుగానే ఎంత మొత్తం చెల్లించాలో తెలుసుకునే అవకాశం ఉంటుందని, తద్వారా రిజిస్ట్రేషన్ వ్యవస్థలో పారదర్శకత మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రజల సౌకర్యార్థం జిల్లాలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో చలానా వివరాల నోటీసు బోర్డులు ఏర్పాటు చేసేలా సంబంధిత అధికారులకు తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని జాయింట్ కలెక్టర్‌ను వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు జోగి శివ, బెల్లంకొండ రవి, భోగిరెడ్డి సుభాని, నిక్కు రాధాకృష్ణ, బోడవుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

