MachilipatnamLocal News
November 22, 2026
మచిలీపట్నం

SSN కథనం, ‘బందరు బంధువులు’ పోస్టుకు తక్షణ స్పందన… జిల్లా కోర్టు రహదారికి మోక్షం

  • November 12, 2026
  • 1 min read
SSN కథనం, ‘బందరు బంధువులు’ పోస్టుకు తక్షణ స్పందన… జిల్లా కోర్టు రహదారికి మోక్షం

 * సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తతో కదిలిన యంత్రాంగం

 * గుంతలను పూడ్చి, డ్రైనేజీకి ఇరువైపులా మట్టి పనులు చేపట్టిన అధికారులు

 * అధికారులకు, ‘ఎస్ఎస్ఎన్’(SSN)కు, ‘బందరు బంధువులు’ గ్రూప్ నిర్వాహకులకు నగర ప్రజల ప్రత్యేక కృతజ్ఞతలు

మచిలీపట్నం:

నగరంలోని అత్యంత రద్దీగా ఉండే జిల్లా కోర్టు రహదారిపై వాహనదారులు, బాటసారులు పడుతున్న నరకయాతనకు ఎట్టకేలకు తెరపడింది. సాయిబాబా గుడి వద్ద నిర్మించిన డ్రైనేజీకి అప్రోచ్ రోడ్డు లేకపోవడం, ఇటీవలి తుఫాను వర్షాలకు రహదారిపై ఏర్పడిన భారీ గుంతలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నవంబర్ 9న ‘ఎస్ఎస్ఎన్’ (SSN) (www.ss-news.com) లో ప్రచురితమైన కథనం, అలాగే నవంబర్ 10న ‘బందరు బంధువులు’ (Bandaru Bandhuvulu) ఫేస్‌బుక్ గ్రూప్‌లో పోస్ట్ చేసిన వార్త తీవ్రంగా వైరల్ కావడంతో జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు.

ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియా వేదికగా కూడా ఈ సమస్యపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో, అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా బుధవారం (నవంబర్ 11) ఉదయం రహదారిపై ప్రమాదకరంగా మారిన గుంతలను పూర్తిగా పూడ్చివేశారు. అనంతరం గురువారం (నవంబర్ 12) బ్రిడ్జి మరియు నూతనంగా నిర్మించిన డ్రైనేజీకి ఇరువైపులా మట్టితో పూడ్చే పనులను వేగవంతం చేశారు.

నెలల తరబడి కేవలం మూడు సిమెంట్ రాళ్ల మీదుగా ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తూ తీవ్ర అవస్థలు పడిన స్థానికులు, కోర్టుకు వచ్చే కక్షిదారులు, వాహనదారులు ఈ పరిణామంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను వెలుగులోకి తెచ్చిన ‘ఎస్ఎస్ఎన్’కు సత్వరమే స్పందించి రహదారిని బాగు చేయించిన జిల్లా ఉన్నతాధికారులకు నగర ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

About Author

SSN