వేమూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 75 మంది విద్యార్థులకు ఉచితంగా స్టీల్ ప్లేట్లు పంపిణీ
మచిలీపట్నం:
విద్యార్థులే నవ సమాజ నిర్మాతలని, దేశ భవిష్యత్తు వారి భుజస్కంధాలపైనే ఆధారపడి ఉందని మచిలీపట్నం మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ అన్నారు. వేమూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక 1వ డివిజన్ మున్సిపల్ పాఠశాలలో 75 మంది విద్యార్థులకు ఉచితంగా భోజన స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బాబా ప్రసాద్ మాట్లాడుతూ, బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో అమూల్యమైన దశ అని, విద్యార్థులు చిన్ననాటి నుంచే విద్యతో పాటు క్రమశిక్షణ, సంస్కారం, సేవాభావం అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థుల సంక్షేమం కోసం వేమూరి చారిటబుల్ ట్రస్ట్ చేపట్టిన ఈ సేవా కార్యక్రమం ఎంతో అభినందనీయమని ప్రశంసించారు.
ట్రస్ట్ నిర్వాహకులు వేమూరి రమేష్ మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యతో పాటు దేశభక్తి, నైతిక విలువలు నేర్పించడం అవసరమని, సమాజంలో నిరుపేదలకు అండగా నిలవడమే తమ ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం నూతనంగా 1వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికైన వంపుగడల గీత్ చరణ్‌ను ‘వెలుగు ఫౌండేషన్’ అధ్యక్షులు చందమామ బాబు సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కె. మాధవి లత, వేమూరి రత్నగిరిరావు, మాటూరి రాజేష్, సమ్మెట రమేష్, డి. భాస్కర్ సింగ్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

