యానాదుల కాలనీలో చిన్నారులతో దీపావళి వేడుకలు నిర్వహించిన ‘హ్యుమానిటీ ఫౌండేషన్’
మచిలీపట్నం:
దీపావళి పండుగ ప్రతీ ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో మచిలీపట్నంలోని ‘హ్యుమానిటీ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో యానాదుల కాలనీ చిన్నారుల మధ్య దీపావళి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నం కాలేఖాన్ పేట సమీపంలోని చెరువు వద్ద నివసిస్తున్న యానాదుల కాలనీకి చెందిన నిరుపేద చిన్నారులకు ఫౌండేషన్ సభ్యులు మిఠాయిలు, దీపావళి టపాసులు అందజేసి, వారితో కలిసి దగ్గరుండి పండుగను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ, సాధారణంగా అందరూ తమ కుటుంబ సభ్యులతో పండుగలు జరుపుకుంటారని, అయితే ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు కూడా పండుగ ఆనందాన్ని పంచాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. టపాసులు అందుకున్న చిన్నారుల ముఖాల్లోని చిరునవ్వులు తమకు ఎంతో సంతృప్తిని ఇచ్చాయని, మన చుట్టూ ఉన్న వారి జీవితాల్లో ఆనందం నింపడమే నిజమైన పండుగ అని పేర్కొన్నారు.
‘సహాయం మీది – సహకారం మాది’ అనే నినాదంతో సేవా కార్యక్రమాలు అందిస్తున్న హ్యుమానిటీ ఫౌండేషన్, భవిష్యత్తులోనూ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుందని ప్రతినిధులు తెలిపారు. ఈ వేడుకల్లో సంస్థ అధ్యక్షురాలు షేక్ నూర్జహాన్, కార్యదర్శి లాయర్ అజ్మతున్నీసా, సభ్యులు విన్నకోట సంధ్య, నాగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

