సమాజ సేవలో బ్రాహ్మణులు ముందుండాలి: బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఘనాపాటి
మచిలీపట్నం:
బ్రాహ్మణులు కులమతాలకు అతీతంగా సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండాలని వైదిక ధర్మ ప్రవర్ధక సంఘం ప్రధాన కార్యదర్శి, బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఘనాపాటి పిలుపునిచ్చారు. మచిలీపట్నం నగర కార్పొరేషన్ ఎన్నికలలో విజయం సాధించిన బ్రాహ్మణ అభ్యర్థులు — 55వ డివిజన్ కార్పొరేటర్ పి. విమల గాయత్రి,, 53వ డివిజన్ కార్పొరేటర్ కాశీభట్ల రాధాకృష్ణలను అభినందిస్తూ గొడుగుపేటలోని శృంగేరి శారదాపీఠం నందు వైదిక ధర్మ ప్రవర్తక సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించి విజేతలకు వేదాశీర్వచనం అందజేశారు.
ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఘనాపాటి మాట్లాడుతూ, మచిలీపట్నం నగర కార్పొరేషన్ ఎన్నికలలో కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 55వ డివిజన్ నుండి విజయం సాధించిన పి. విమల గాయత్రికి మరియు ఆమెను ఆదరించిన 55వ డివిజన్ ప్రజలకు బ్రాహ్మణుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే 53వ డివిజన్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందిన బ్రాహ్మణ సోదరుడు కాశీభట్ల రాధాకృష్ణను ఆదరించి గెలిపించిన ఆ డివిజన్ ప్రజలకు కూడా బ్రాహ్మణుల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.
గెలుపొందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు కులమతాలకు అతీతంగా సమాజ సేవలో ముందుండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పి. వి. ఫణి కుమార్, రాళ్లపల్లి ఆంజనేయ శాస్త్రి, భవిష్య, మోపర్తి సుబ్రమణ్యంలతో పాటు వైదిక ధర్మ ప్రవర్తన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

