రేపు కృష్ణా జిల్లా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు: కలెక్టర్ డి.కె. బాలాజీ
మచిలీపట్నం:
కృష్ణా జిల్లాలో రెండవ సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా మచిలీపట్నం నగరపాలక సంస్థతో పాటు పెడన, ఉయ్యూరు మున్సిపాలిటీల్లో రేపు (మంగళవారం) నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డి.కె. బాలాజీ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మొత్తం మూడు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఓట్ల లెక్కింపు కోసం జిల్లా వ్యాప్తంగా 290 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ విధుల నిర్వహణకు 1,160 మంది సిబ్బందిని నియమించగా, అత్యవసర సమయాల్లో ఉపయోగించుకోవడానికి అదనంగా 236 మంది సిబ్బందిని రిజర్వ్‌లో అందుబాటులో ఉంచారు.
స్థానిక సంస్థల వారీగా కౌంటింగ్ ఏర్పాట్లు
* మచిలీపట్నం కార్పొరేషన్: 168 కౌంటింగ్ టేబుళ్లు, 811 మంది సిబ్బంది.
* పెడన మున్సిపాలిటీ: 57 కౌంటింగ్ టేబుళ్లు, 275 మంది సిబ్బంది.
* ఉయ్యూరు మున్సిపాలిటీ: 65 కౌంటింగ్ టేబుళ్లు, 310 మంది సిబ్బంది.
కౌంటింగ్ కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులను సిద్ధం చేశామని కలెక్టర్ వివరించారు. లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం నిబంధనలు, మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు.

