కోస్తా ఆంధ్రకు ‘మురసు’ తుపాను ముప్పు: నెల్లూరు – నర్సాపురం మధ్య తీరం దాటే అవకాశం
అమరావతి:
నైరుతి మరియు దానికి ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు తుపాను’ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 27 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుపాను, ప్రస్తుతం చెన్నైకి 480 కిమీ, నెల్లూరుకు 550 కిమీ, మచిలీపట్నానికి 560 కిమీ, ఒంగోలుకు 600 కిమీ, విశాఖపట్నానికి 610 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
రేపు అర్ధరాత్రి తీరం దాటే అవకాశం
ఈ తుపాను రేపు (సోమవారం) ఉదయానికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడనుంది. అనంతరం వాయువ్య దిశగా ప్రయాణించి రేపు అర్ధరాత్రి నుంచి ఎల్లుండి (మంగళవారం) తెల్లవారుజాము మధ్య నెల్లూరు – నర్సాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు 100 నుండి 110 కి.మీ, గరిష్ఠంగా 120 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
మూడు రోజుల పాటు భారీ వర్షాలు
తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. రేపు మధ్యాహ్నం నుంచే కోస్తా తీరం వెంబడి గంటకు 80-90 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపిన అధికారులు, మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకి వెళ్లరాదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
జిల్లా వారీగా వర్షపాత హెచ్చరికలు:
సోమవారం (02-11-2026):
* అత్యంత భారీ వర్షాలు: కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
* అతిభారీ వర్షాలు: ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల.
* భారీ వర్షాలు: అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో.
మంగళవారం (03-11-2026):
* అత్యంత భారీ వర్షాలు: అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు నమోదు కావచ్చు.
* అతిభారీ వర్షాలు: విజయనగరం, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో.
* భారీ వర్షాలు: శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో.
బుధవారం (04-11-2026):
* కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
రంగంలోకి NDRF, SDRF బృందాలు
తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు సహాయక చర్యల కోసం ప్రభుత్వం 6 NDRF, 7 SDRF బృందాలను సిద్ధం చేసి మోహరించింది.
* బృందాల మోహరింపు: కృష్ణా (2), బాపట్ల (2), గుంటూరు (2), నెల్లూరు (2), ప్రకాశం (2), మార్కాపురం (1), పల్నాడు (1), తిరుపతి (1).
* అత్యవసర పరిస్థితుల కోసం మరికొన్ని బృందాలను కూడా అందుబాటులో ఉంచారు.
ప్రజా సహాయం & అత్యవసర నంబర్లు
ప్రజలు అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఏపిఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ కోరారు. తుపాను వల్ల ఏ సమస్య ఎదురైనా ‘మన మిత్ర’ WhatsApp నంబర్ 9552300009 ద్వారా అధికారులకు సమాచారం అందించవచ్చు.
అత్యవసర హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నంబర్లు:
* 112
* 1070
* 1800 425 0101

