వైసీపీకి ఓటు వేయడమంటే అరాచకాన్ని ప్రోత్సహించడమే: మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం:
వైసీపీకి ఓటు వేయడమంటే అరాచకాన్ని ప్రోత్సహించడమేనని, ప్రజల కోసం పనిచేసే కూటమి నాయకులను గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో గురువారం కూటమి నేతలతో కలిసి ఆయన ఉమ్మడి పాత్రికేయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి పట్టం కట్టిన స్ఫూర్తితోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నామినేషన్లు వేయనీయకుండా దాడులకు తెగబడ్డారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, సూపర్ సిక్స్ పథకాలను గ్రాండ్ సక్సెస్ చేశామని తెలిపారు.
మచిలీపట్నంలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు పోర్టు, ఫిషింగ్ హార్బర్, మెడికల్ కాలేజీ పనులను వేగవంతం చేశామని, మంగినపూడి బీచ్‌ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనతో పాటు రూ. 22 లక్షల కోట్ల పెట్టుబడులు రావడమే కాకుండా, మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. ఇటీవల సంభవించిన ‘ఆర్నబ్’ తుఫాను తీవ్ర నష్టం కలిగించినా, 24 గంటల్లోనే విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించి నష్టపరిహారం ప్రకటించామని చెప్పారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం 800 కిలోమీటర్ల రోడ్లు నిర్మిస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్దికాలంలోనే 10 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు పూర్తి చేసి మరో 10 వేల కిలోమీటర్లు నిర్మాణంలో ఉంచిందని తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ తాగునీటి కులాయిలు అందిస్తున్నామని వివరించారు.
డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, సీనియర్ నాయకులు బూరగడ్డ వేదవ్యాస్, కొనకళ్ల జగన్నాథరావు (బుల్లయ్య) మాట్లాడుతూ.. 16వ ఆర్థిక సంఘం నిధులను సాధించేందుకు ప్రభుత్వం స్థానిక ఎన్నికలను త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తుంటే, వైసీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. తుఫాను సమయంలోనూ చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్లు సమీక్షించి ప్రాణనష్టం లేకుండా చూశారని కొనియాడారు.
ఈ విలేకరుల సమావేశంలో మేయర్ అభ్యర్థి అబ్దుల్ అబీదా, బీజేపీ ప్రతినిధులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

