MachilipatnamLocal News
November 22, 2026
జిల్లా

పునరావాస కేంద్రాల్లో బాధితులకు అన్ని సౌకర్యాలు: కలెక్టర్ డీకే బాలాజీ భరోసా

  • October 28, 2026
  • 1 min read
పునరావాస కేంద్రాల్లో బాధితులకు అన్ని సౌకర్యాలు: కలెక్టర్ డీకే బాలాజీ భరోసా

మచిలీపట్నం:

అర్నబ్ తుఫాను ప్రభావం దృష్ట్యా ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కృష్ణా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా బుధవారం కృష్ణా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్‌తో కలిసి పలు పునరావాస కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి వసతులను పరిశీలించారు.

చందాల, ముంజులూరు కేంద్రాల్లో తనిఖీలు
కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు మొదట కృత్తివెన్ను మండలం చందాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న ప్రజలతో నేరుగా మాట్లాడి భోజనం, తాగునీరు, వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం బంటుమిల్లి మండలం ముంజులూరు ZPHS పాఠశాలలోని పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేశారు. విద్యుత్ అంతరాయం కలగకుండా జనరేటర్ల ఏర్పాటు, తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

“తుఫాను తగ్గే వరకు కేంద్రాల్లోనే ఉండండి”

ఈ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ — “ఎవరూ అధైర్యపడవద్దు, ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాం. తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయని అధికారులు చెప్పే వరకు ఎవరూ ఇళ్లకు వెళ్లవద్దు” అని భరోసా ఇచ్చారు.

అధికారులు నిరంతరం పునరావాస కేంద్రాలను పర్యవేక్షించాలని, ఆహారం, వైద్యం, విద్యుత్ వంటి అత్యవసర సదుపాయాలకు ఎలాంటి లోటు రాకుండా చూడాలని ఆదేశించారు. ఈ పర్యటనలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి పోతురాజుతో పాటు వివిధ మండలాల అధికారులు పాల్గొన్నారు.

About Author

SSN