నౌకా నిర్మాణ కేంద్రం భూసేకరణకు మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి: సీపీఎం డిమాండ్
మచిలీపట్నం:
మచిలీపట్నం పోర్టు సమీపంలో ప్రతిపాదిత నౌకా నిర్మాణ కేంద్రం (షిప్‌యార్డ్) కోసం భూములు కోల్పోతున్న రైతులందరికీ వర్తించే మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం కృష్ణా జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా సీపీఎం కృష్ణా జిల్లా కార్యదర్శి వై. నరసింహారావు, మచిలీపట్నం నగర కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. గోవా షిప్‌యార్డ్ సంస్థకు 400 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం, ₹8,000 కోట్ల పెట్టుబడితో 10 వేల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించడాన్ని ప్రస్తావించారు. పోర్టు విస్తరణ కోసం సేకరించే 1,400 ఎకరాలలోనే ఈ 400 ఎకరాలను కేటాయిస్తున్నారని తెలిపారు.
ఈ సేకరణ పరిధిలోకి వచ్చే భూములలో చిన్న, సన్నకారు రైతులకు చెందిన పట్టా భూములతో పాటు ఎస్సైన్డ్ భూములు, ఏళ్ల తరబడి పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములు ఉన్నాయని పేర్కొన్నారు. జీవనాధారమైన ఈ భూములను కోల్పోతున్న రైతులకు తగిన న్యాయం చేయాలని, ఎస్సైన్డ్ భూములు మరియు సాగు భూములకు కూడా పట్టా భూములతో సమానంగా పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

