MachilipatnamLocal News
September 25, 2026
జిల్లా

మచిలీపట్నంలో రూ.8వేల కోట్లతో గోవా షిప్‌యార్డ్: 10 వేల మందికి ఉపాధి – మంత్రి కొల్లు రవీంద్ర

  • September 24, 2026
  • 1 min read
మచిలీపట్నంలో రూ.8వేల కోట్లతో గోవా షిప్‌యార్డ్: 10 వేల మందికి ఉపాధి – మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం:

మచిలీపట్నం నగరానికి పూర్వ వైభవం తీసుకువచ్చేలా గోవా షిప్‌యార్డ్ సంస్థ ఆధ్వర్యంలో రూ. 8వేల కోట్ల భారీ పెట్టుబడితో 400 ఎకరాల్లో నౌకా నిర్మాణ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గురువారం మచిలీపట్నంలోని ఆర్ & బి అతిథి గృహంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఈ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు.

మచిలీపట్నం పోర్టుకు అనుబంధంగా ఏర్పాటుకానున్న ఈ గోవా షిప్‌యార్డ్ ద్వారా యుద్ధ నౌకలు, కోస్ట్‌గార్డ్ పడవలు, ఇతర రవాణా నౌకలను తయారు చేస్తారని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 10 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అనుబంధ పరిశ్రమల ద్వారా మరో రూ. 3వేల నుంచి రూ. 4వేల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అవసరమైన అన్ని ప్రభుత్వ అనుమతులు, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేసి రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభమయ్యేలా చూస్తామన్నారు. మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో ఈ పరిశ్రమ మచిలీపట్నానికి రావడం సాధ్యమైందని పేర్కొంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా స్థానిక యువతకు, మహిళలకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించి, పర్యావరణానికి మరియు రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా పరిశ్రమలను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు.

కొత్త పారిశ్రామిక శకం ప్రారంభం – కొనకళ్ళ నారాయణరావు

ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ, మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు వేగవంతం కావడంతో పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందన్నారు. షిప్‌యార్డ్‌తో పాటు భవిష్యత్తులో ఆయిల్ రిఫైనరీలు, కంటైనర్ ఆధారిత పరిశ్రమలు వస్తాయని, స్థానిక యువతకే ఉద్యోగాల్లో అధిక ప్రాధాన్యత లభించేలా చూస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో మచిలీపట్నం ఏఎంసీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్, మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, కూటమి నాయకులు పంతం గజేంద్రరావు, పినిశెట్టి వేణు తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN