కృష్ణా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
మచిలీపట్నం:
కృష్ణా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. దేశంలో సేవా కార్యక్రమాలకు ఎన్ఎస్ఎస్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందని ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు.
ఈ కార్యక్రమానికి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్, కళాశాల ఎన్ఎస్ఎస్ చైర్మన్ ఆచార్య వై.కె. సుందర కృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — విద్యా వ్యవస్థ అనేది సామాజిక సేవా కార్యక్రమాల్లో అంతర్భాగంగా ఉండాలనే సదుద్దేశంతోనే ఎన్ఎస్ఎస్ రూపుదిద్దుకుందని తెలిపారు. ‘క్యాంపస్ అండ్ కమ్యూనిటీ’, ‘కాలేజ్ అండ్ విలేజ్’, ‘నాలెడ్జ్ అండ్ యాక్షన్’ అనే లక్ష్యాలతో పనిచేస్తున్న సంస్థ కార్యకలాపాల్లో నేటి విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అనంతరం వర్సిటీ సిడిసి డీన్ ఆచార్య ఆర్. కిరణ్ కుమార్ మాట్లాడుతూ — జాతీయ స్థాయిలో ఎదిగిన తర్వాతే సేవ చేయాల్సిన అవసరం లేదని, సామాన్య పౌరుడు కూడా జాతీయ భావాలతో చేసే ప్రతి పని నిజమైన సేవే అవుతుందని స్పష్టం చేశారు. కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ ఎం. బాబు రెడ్డి మాట్లాడుతూ — నిత్య జీవితంలో మన చుట్టుపక్కల వారికి చేసే ఏ చిన్న సాయమైనా జాతీయ సేవ కిందకే వస్తుందని పేర్కొంటూ విద్యార్థులను ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ పి. గోపి, ఆర్. దుర్గాప్రసాద్, కె. కవిత, ఎన్. రంగశ్రీలతో పాటు ఇతర బోధనా సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

