వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల పోరుబాట: 30 రోజుల శాంతియుత నిరసనలకు పిలుపు
మచిలీపట్నం :
ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (AP MHC JAC) ఆధ్వర్యంలో 30 రోజుల శాంతియుత నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 8, 2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఈ ఆందోళనలో ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించడం (రెగ్యులరైజేషన్), 100 శాతం స్థూల వేతనం (Gross Salary) చెల్లించడం మరియు ఇతర సర్వీస్ సంబంధిత ఆర్థికేతర సమస్యలను పరిష్కరించడమే ప్రధాన డిమాండ్లుగా జేఏసీ ప్రతినిధులు స్పష్టం చేశారు.
సమస్యల పరిష్కారం కోరుతూ జేఏసీ నాయకులు వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి, ముఖ్య కార్యదర్శికి, హెల్త్ కమిషనర్, డీఎంఈ, డీపీహెచ్, డీఎస్‌హెచ్ తదితర ఉన్నతాధికారులకు ఇప్పటికే వినతిపత్రాలు సమర్పించారు. ఆర్థికేతర అంశాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ వేసి 30 రోజుల్లోగా సమస్యలు తీరుస్తామని, అలాగే రెగ్యులరైజేషన్, వేతన పెంపుదలపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిర్దిష్ట సమయంలోగా నిలబెట్టుకోకపోతే, ఈ 30 రోజుల శాంతియుత నిరసనల అనంతరం కార్యాచరణను మరింత తీవ్రతరం చేస్తామని జేఏసీ హెచ్చరించింది.

