మంగినపూడి విజయ గణపతికి 630 కిలోల మహా లడ్డూ!
మచిలీపట్నం:
మంగినపూడి సముద్రతీరంలో కొలువుదీరనున్న 63 అడుగుల భారీ మట్టి విజయ గణపతికి అపురూపమైన నైవేద్యాన్ని సమర్పించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక మల్లయ్య స్వీట్స్ అధినేత, రోటరీ క్లబ్ అధ్యక్షుడు గౌర వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు రూ. 6.50 లక్షల వ్యయంతో తయారు చేస్తున్న 630 కిలోల మహా లడ్డూను స్వామివారికి భక్తిశ్రద్ధలతో సమర్పించనున్నారు.
ఈ సందర్భంగా ఈడేపల్లిలోని మల్లయ్య స్వీట్స్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మంగినపూడి బీచ్‌లో తొలిసారిగా 63 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 14 నుండి 24 వరకు 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 10 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
స్వచ్ఛమైన శెనగపిండి, నెయ్యి, సుగంధ ద్రవ్యాలతో పవిత్రంగా ఈ 630 కిలోల లడ్డూను తయారు చేస్తున్నామని వివరించారు. ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి నగరం నుండి భారీగా తరలించి, క్రేన్ సహాయంతో సముద్రతీరానికి చేర్చి స్వామివారి చేతిలో నైవేద్యంగా ఉంచనున్నట్లు తెలిపారు. స్వామివారి చేతిని 2,000 కిలోలకు పైగా బరువును మోయగలిగేలా ప్రత్యేకంగా రూపొందించినట్లు పేర్కొన్నారు.
విజయ గణపతి ఆశీస్సులతో మచిలీపట్నం ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని, బందరు ఓడరేవు పనులు త్వరగా పూర్తయి పరిశ్రమలు తరలిరావాలని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించాలని ఆకాంక్షించారు. తనకు ఈ మహా లడ్డూను సమర్పించే భాగ్యం కల్పించిన మంత్రి కొల్లు రవీంద్రకు, ఉత్సవ కమిటీ నిర్వాహకులకు వెంకటేశ్వరరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

