మత్స్యకారులకు లీటరుకు ₹9 డీజిల్ సబ్సిడీ: సబ్సిడీ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్
బంటుమిల్లి/కృత్తివెన్ను:
సముద్ర వేటపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. బంటుమిల్లి మండలం నాగేశ్వరరావుపేటలోని తన స్వగృహం వద్ద కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాలకు చెందిన అర్హులైన మత్స్యకారులకు ప్రభుత్వం మంజూరు చేసిన డీజిల్ సబ్సిడీ కార్డులను ఆయన గురువారం అందజేశారు.
ఈ సందర్భంగా వేటకు వెళ్లే బోట్లకు లీటరు డీజిల్‌పై రూ.9 సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుండటం పట్ల మత్స్యకారులు తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. కాగా, గతంలో కొంతకాలం పాటు ఈ సబ్సిడీ అందగా, ఆ తర్వాత సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన విషయాన్ని మత్స్యకారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, మత్స్యశాఖ అధికారులతో మాట్లాడారు. కేవలం సాంకేతిక లోపాల వల్లే పంపిణీలో అంతరాయం ఏర్పడిందని అధికారులు వివరించగా.. సబ్సిడీ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నిరంతరం, పూర్తిస్థాయిలో అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, మత్స్యకార నాయకులు పాల్గొన్నారు.

