గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు
మచిలీపట్నం:
రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు సూచించారు. ఉత్సవాల సందర్భంగా ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ మరియు మతసామరస్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
సింగిల్ విండో అనుమతి – నిబంధనలు ఇవే
విగ్రహ ప్రతిష్ఠాపన చేసే ఉత్సవ కమిటీలు తప్పనిసరిగా https://ganeshutsav.net/ వెబ్సైట్ ద్వారా వివరాలు నమోదు చేసి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. దీనితో పాటు పంచాయతీ లేదా మున్సిపాలిటీ, స్థల యజమాని మరియు విద్యుత్ శాఖల అనుమతులు కలిగి ఉండాలి. విగ్రహాల తరలింపు సమయంలో ర్యాలీలు, ట్రాఫిక్కు ఆటంకం కలిగించే చర్యలు మరియు రెచ్చగొట్టే నినాదాలు నిషిద్ధం. శబ్ద కాలుష్యాన్ని అరికట్టేందుకు డీజేలు, సౌండ్ సిస్టమ్స్, బాణాసంచా వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. మండపాల వద్ద భక్తి పాటలు మాత్రమే ప్లే చేయాలని, భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి 24 గంటలూ కమిటీ సభ్యులు అందుబాటులో ఉండాలని ఎస్పీ సూచించారు.
రహదారులను ఆక్రమించి ట్రాఫిక్కు భంగం కలిగించినా, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్సవాలను సోదరభావంతో జరుపుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

