మచిలీపట్నంలో బిజెపి జిల్లా విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ సిద్ధం
మచిలీపట్నం:
కృష్ణా జిల్లా బిజెపి ఆఫీస్‌లో ఆదివారం జిల్లా అధ్యక్షులు తాతినేని శ్రీరామ్ అధ్యక్షతన జిల్లా విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం మరియు ‘సేవా సంకల్ప అభియాన్’ జిల్లా కార్యశాల ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ కార్యకలాపాలపై సుదీర్ఘంగా చర్చించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేలా క్యాడర్‌కు దిశా నిర్దేశం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, డివిజన్లు మరియు వార్డు స్థాయిల్లో త్వరలోనే నూతన బాధ్యులను నియమించాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా జిల్లా పార్టీ ఏకగ్రీవంగా రాజకీయ మరియు ధన్యవాద తీర్మానాలను ఆమోదించింది. ‘వికసిత్ భారత్ – 2047’ లక్ష్య సాధనకు, ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి, కృష్ణా జిల్లా ప్రగతికి, ప్రజా సంక్షేమానికి మరియు పార్టీ సంస్థాగత బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, కృష్ణా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న డబుల్ ఇంజన్ ఎన్డీయే ప్రభుత్వానికి, రాష్ట్రానికి అండగా నిలుస్తున్న గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ధన్యవాద తీర్మానాన్ని ఏకగ్రీవంగా సమ్మతించారు.
నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు బిజెపి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమాలపై సమావేశం దృష్టి సారించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక, సేవా సంకల్ప అభియాన్ జిల్లా కన్వీనర్ పుప్పాల రామాంజనేయులు పార్టీ చేపట్టబోయే 9 రకాల సేవా కార్యక్రమాలపై నాయకులు, కార్యకర్తలకు సమగ్ర మార్గదర్శనం చేశారు.
ఈ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా ఇన్చార్జ్, జిల్లా పదాధికారులు, వివిధ మోర్చాల జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జిలు, సేవా సంకల్ప అభియాన్ జిల్లా కో-కన్వీనర్లు, మండలాల ఇన్చార్జులు, మండల అధ్యక్షులు, సేవా సంకల్ప అభియాన్ మండల కమిటీ సభ్యులు మరియు SIR జిల్లా, అసెంబ్లీ కన్వీనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

