మచిలీపట్నంలో ఘనంగా కృష్ణాష్టమి: మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్యాత్మిక సంబరాలు
మచిలీపట్నం:
మచిలీపట్నంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో సాగాయి. ఈ సందర్భంగా బందరులోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బందరుకోట రామాలయంలో గోవులకు నైవేద్యం సమర్పించి, భక్తులతో కలిసి కోలాటం, కర్రసాము ఆడటంతో పాటు ఉట్టి కొట్టి సంబరాల్లో మునిగితేలారు. అనంతరం గొడుగుపేట, బృందావన్ థియేటర్, సర్కిల్ పేట సంతాన వేణుగోపాలస్వామి ఆలయం, ఆర్.గొల్లపాలెం, నిజాంపేట బొమ్మలమెడ ఆలయాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, కృష్ణాష్టమి కేవలం పండుగ మాత్రమే కాదని, సమాజానికి ధర్మాన్ని బోధించే గొప్ప సందేశమని పేర్కొన్నారు. “మనం ధర్మాన్ని రక్షిస్తే.. మనల్ని రక్షించే బాధ్యత ఆ పరమాత్ముడు తీసుకుంటాడు” అని అన్నారు. లోకంలో అధర్మం పెరిగినప్పుడు చెడుపై మంచి సాధించే విజయానికి ఈ పండుగ ప్రతీక అని తెలిపారు. బాలగోపాలుని కృపతో రాష్ట్రంలోని ప్రతి ఇంటా సుఖసంతోషాలు, శాంతిసౌభాగ్యాలు వెల్లివిరియాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్లు చెప్పారు. ఈ వేడుకల సందర్భంగా పలుచోట్ల నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు స్వయంగా భోజనాలు వడ్డించారు.

