స్థానిక బస్టాండ్ సెంటర్ ప్రాంతంలో శనివారం నగరపాలక సంస్థ చేపట్టిన కార్ స్టాండ్ తొలగింపు చర్యలు స్వల్ప ఉద్రిక్తతకు దారితీశాయి. ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం దృష్ట్యా దీర్ఘకాలంగా కొనసాగుతున్న కార్ల స్టాండ్‌ను వెంటనే తొలగించాలని నగరపాలక సంస్థ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా కార్ స్టాండ్ నిర్వహకులు, కార్మికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పరిస్థితి అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీగా మొహరించారు. తొలగింపుల సమయంలో పోలీసులు, కార్ స్టాండ్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కార్ స్టాండ్ తొలగింపుతో తమ ఉపాధి కోల్పోతున్నామని కార్ స్టాండ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.