MachilipatnamLocal News
April 30, 2026
మచిలీపట్నం

ప్రముఖ పర్యాట కేంద్రంగా మంగినపూడి బీచ్.. మంత్రి కొల్లు రవీంద్ర

  • April 25, 2026
  • 1 min read
[addtoany]
ప్రముఖ పర్యాట కేంద్రంగా మంగినపూడి బీచ్.. మంత్రి కొల్లు రవీంద్ర
బీచ్ లో రూ.96.78 లక్షల వ్యయంతో మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి
 
మచిలీపట్నం :
 
మంగినపూడి బీచ్‌ను రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
 
సిఎస్ఆర్ నిధులు రూ.96.78 లక్షల వ్యయంతో మచిలీపట్నం నియోజకవర్గంలోని మంగినపూడి బీచ్ వద్ద మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాల కల్పనకు శనివారం ఉదయం మంత్రి శంకుస్థాపన చేశారు. 
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మంగినపూడి బీచ్ రాష్ట్రంలో ప్రజలకు అత్యంత చేరువగా ఉండే బీచ్‌లలో ఒకటిగా ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ఇక్కడ పర్యాటకంతో పాటు అనేక మత విశ్వాసాలకు సంబంధించిన సాంప్రదాయ కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతుండటంతో దీని ప్రాముఖ్యత మరింత పెరిగిందని చెప్పారు. గతంలో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్‌కు లక్షలాది మంది హాజరై మూడు రోజుల పాటు ఆనందంగా గడిపిన విషయాన్ని గుర్తుచేసిన మంత్రి, ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బీచ్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. 
 
2014-19 మధ్య కాలంలో బీచ్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ భూభాగాన్ని మెరక చేయడం, అంతర్గత రహదారులు, వాకింగ్ ట్రాక్‌లు వంటి సదుపాయాలు ఏర్పాటు చేసినప్పటికీ, 2019-24 మధ్య కాలంలో నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి పనులు నిలిచిపోయాయని అన్నారు.
 
ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత మంగినపూడి బీచ్ అభివృద్ధిని ప్రథమ ప్రాధాన్యతగా తీసుకుని మళ్లీ బీచ్ ఫెస్టివల్ నిర్వహించడంతో పాటు యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఆధునిక మరుగుదొడ్లు, కాఫీ షాప్‌లు ఏర్పాటు చేయడం జరుగుతోందని చెప్పారు.
 
ఈ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏపీఎండిసి ద్వారా సిఎస్‌ఆర్ నిధుల కింద రూ.96.78 లక్షలు వినియోగిస్తున్నామని, అలాగే పంచాయతీరాజ్ నిధుల ద్వారా సుమారు రూ.90 లక్షలతో రహదారులు కూడా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.
 
మంగినపూడి బీచ్ ప్రాంతంలో రిసార్టులు, సినిమా షూటింగ్‌ల కోసం స్టూడియోలు, గోల్ఫ్ కోర్ట్‌లు ఏర్పాటు చేయడానికి ప్రైవేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. సుమారు 200 ఎకరాల మేర భూమిని అభివృద్ధి కోసం గుర్తించి సర్వేలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే మచిలీపట్నం బే పార్క్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా మెరీనా, యాట్స్ పార్కింగ్, రిసార్ట్స్ అభివృద్ధి పనులు చేపట్టే ప్రణాళికలు ఉన్నాయని వివరించారు. అదేవిధంగా హెరిటేజ్ విలేజ్ ఏర్పాటు చేయడానికి ప్రముఖ దర్శకులు ఆసక్తి చూపుతున్నారని, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. డచ్, బ్రిటిష్, పోర్చుగీస్ కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్లు ఉన్న నేపథ్యంలో విదేశీయులు కూడా ఈ ప్రాంతంపై ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. మంగినపూడి బీచ్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని అనుమతులను వేగంగా మంజూరు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
 
కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్ఈ రమణరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గుమ్మడి విద్యాసాగర్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు, మచిలీపట్నం నార్త్ మండలం తహసిల్దార్ నాగభూషణం, ఏఈ హరిబాబు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కారెడ్ల సుశీల, కూటమి నాయకులు శేషగిరి, సోమశేఖర్, మధు తదితర నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *