యోగా తో మానసిక, ఆధ్యాత్మిక ప్రశాంతత…… నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు
మచిలీపట్నం:
యోగ సాధన చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ సి.హెచ్.బాపిరాజు ప్రజలకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం గాంధీనగర్ లోని వాకర్స్ అసోసియేషన్ హాలు నుంచి ఎపి యోగ సభ ఆధ్వర్యంలో జరిగిన యోగా బైక్ ర్యాలీ ని కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ డికె బాలాజీ నాన్న కృష్ణయ్య శెట్టి తో కలిసి కమిషనర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ యోగా బైక్ ర్యాలీ పట్టణ పుర వీధుల్లో లక్ష్మీ టాకీస్ సెంటర్, బస్టాండ్, కోనేరు సెంటర్ మీదుగా గొడుగుపేట లోని శంకర మఠం యోగాశ్రమం కి వెళ్లి, అక్కడ నుంచి చింతకుంట పాలెం లోని దివ్య యోగ మందిర్ వరకు సాగింది.
పట్టణ పుర వీధుల్లో సాగిన ఈ ర్యాలీ లో షుమారు 100 మంది యోగా సభ్యులు ఉత్సాహంగా పాల్గొని, యోగా వలన కలిగే ప్రయోజనాలను నినాదాలు రూపం లో ప్రజలకు తెలియచేస్తూ, యోగా పట్ల అవగాహన కలిగించారు.
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ యోగ సాధన వలన చాలా ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. యోగా తో మానసిక, ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ముఖ్యంగా యోగాతో మధుమేహం, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు, ఆస్తమా తదితర వ్యాధులను, ఎలాంటి ఖర్చు లేకుండా యోగా తో సహజ సిద్ధంగా నియంత్రించుకొని, ఆరోగ్యం గా జీవనం గడపవచ్చన్నారు. ఎపి యోగ సభ ఆధ్వర్యంలో మచిలీపట్నం లో 5 కేంద్రాల్లో ఉదయం 5-30 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతి రోజూ ఉచితంగా యోగ శిక్షణా తరగతులు జరుగుతున్నాయన్నారు. . ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాపిరాజు కోరారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ డికె బాలాజీ నాన్న కృష్ణయ్య శెట్టి మాట్లాడుతూ యోగా వలన తనకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలిగాయని పేర్కొన్నారు. తనను దీర్ఘకాలంగా వేదిస్తున్న గ్యాస్ట్రిక్ సమస్య పూర్తిగా తొలగి పోయిందన్నారు. అదేవిధంగా వర్టిగో ( తల తిరుగుడు) సమస్య కూడా చాలా వరకు తగ్గి పోయిందన్నారు. ప్రజలంతా నిత్యం యోగ సాధన చేసి వ్యాధుల నుంచి విముక్తి పొంది, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో పల్లపోతు కృష్ణ, ఘంటసాల గురునాధబాబు, మహాలక్ష్మీ, మద్దాల చింతయ్య, శీలం రమేష్, వడ్డి శ్రీనివాస్, మిరియాల సురేష్, తమ్మన సూర్య నారాయణ, మాటూరి విజయ భాస్కర్, మృత్యుంజయుడు, రేఖా రంజిత, రాజకుమారి, గిరి కుమారి తదితరులు పాల్గొన్నారు.

