విజయవాడలో లోకాయుక్త క్యాంపు సిట్టింగ్: సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 1 వరకు విచారణలు
విజయవాడ:
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త సంస్థ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు విజయవాడలో ప్రత్యేక క్యాంపు సిట్టింగ్ నిర్వహించనున్నట్లు లోకాయుక్త సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. గౌరవ ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు ఆధ్వర్యంలో ఈ క్యాంపు సిట్టింగ్ జరగనుంది.
2026 సెప్టెంబర్ 28, 29, 30 తేదీలతో పాటు అక్టోబర్ 1వ తేదీన విజయవాడలో ఈ విచారణలు జరుగుతాయి.
క్యాంపు సిట్టింగ్ వేదిక:
* కోర్టు హాలు: సబ్ కలెక్టర్ అండ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కార్యాలయం
* ఓల్డ్ మాంటిస్సోరి మహిళా కళాశాల ప్రాంగణం, ఆకాశవాణి రేడియో స్టేషన్ ఎదురుగా, ఎం.జి. రోడ్డు.
పరిధిలోకి వచ్చే జిల్లాలు:
ఈ క్యాంపు సిట్టింగ్లో బాపట్ల, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఎన్.టి.ఆర్., పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం మరియు విజయనగరం జిల్లాలకు సంబంధించిన ఫిర్యాదులను విచారణకు చేపట్టనున్నారు. బాధితులు సుదూర ప్రాంతాలకు ప్రయాణించే అవసరం లేకుండా, సకాలంలో ఫిర్యాదులపై విచారణ జరిపి సేవలను సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశం.
కొత్త ఫిర్యాదుల స్వీకరణ:
ఇప్పటికే విచారణకు జాబితా చేసిన కేసులతో పాటు, ప్రజల నుంచి కొత్త ఫిర్యాదులను కూడా స్వీకరించనున్నారు. లోకాయుక్త పరిధిలోకి వచ్చే సమస్యలున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పేర్కొన్న తేదీలలో క్యాంపు వేదిక వద్ద నేరుగా తమ ఫిర్యాదులను సమర్పించవచ్చు.
ఇప్పటికే జాబితా చేసిన కేసులకు సంబంధించిన ఫిర్యాదుదారులు, ప్రజాసేవకులు మరియు ఇతర పక్షాలు లోకాయుక్త సంస్థ తెలిపిన తేదీలలో క్యాంపు సిట్టింగ్కు హాజరు కావాలని కోరారు. కేసుల వివరాలతో కూడిన ‘కాజ్ లిస్ట్’ను లోకాయుక్త అధికారిక వెబ్సైట్ [https://lokayukta.ap.gov.in](https://lokayukta.ap.gov.in) లో అందుబాటులో ఉంచినట్లు రిజిస్ట్రార్ తెలిపారు.

