MachilipatnamLocal News
October 17, 2026
జిల్లా

10 నెలల నిరీక్షణకు తెర: జాయింట్ కలెక్టర్ స్పందనతో బాధితులకు అందిన పోస్టుమార్టం నివేదిక!

  • September 27, 2026
  • 1 min read
10 నెలల నిరీక్షణకు తెర: జాయింట్ కలెక్టర్ స్పందనతో బాధితులకు అందిన పోస్టుమార్టం నివేదిక!

పమిడిముక్కల / మచిలీపట్నం:

విద్యుత్ షాక్‌తో మృతి చెందిన దళిత బాలుడి కుటుంబానికి 10 నెలల తర్వాత ఎట్టకేలకు శవ పరీక్ష (పోస్టుమార్టం) నివేదిక అందడంతో బాధితులకు ఊరట లభించింది.

ఘటన వివరాలు:

కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గురజాడ గ్రామానికి చెందిన దళిత విద్యార్థి కాండ్రు హర్షవర్ధన్ (12) గత ఏడాది ఆగస్టు 18, 2025న ఆడుకుంటూ షామియానా స్తంభాన్ని పట్టుకోవడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాడు. మాజీ లోకాయుక్త జస్టిస్ పి. లక్ష్మణరెడ్డి ఆదేశాల ప్రకారం విద్యుత్ ప్రమాదాల్లో మరణించిన బాధితులకు సంబంధిత శాఖ రూ. 5 లక్షల నష్టపరిహారం అందించాల్సి ఉంటుంది.

లంచం ఇచ్చినా తప్పని తిప్పలు:

ఈ పరిహారాన్ని పొందడానికి అవసరమైన పోస్టుమార్టం నివేదిక కోసం బాలుడి తండ్రి అభిషేక్, తాత వసంతం దాదాపు 12 నెలలుగా పమిడిముక్కల పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. పోలీసులు రూ. 4,000 లంచం తీసుకున్నప్పటికీ నివేదిక ఇవ్వకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించారని ఆర్.టి.ఐ కార్యకర్తలు ఆరోపించారు.

స్పందించిన జాయింట్ కలెక్టర్:

బాధిత కుటుంబ సభ్యులతో కలిసి ఆర్.టి.ఐ. కార్యకర్తలు జంపాన శ్రీనివాస గౌడ్, బేతపూడి జోగేశ్వరరావు ఈ నెల 7వ తేదీన నిర్వహించిన పి.జి.ఆర్.ఎస్ (PGRS) కార్యక్రమంలో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎమ్. నవీన్ కు ఫిర్యాదు చేశారు. బాధితుల సమస్యపై తక్షణమే స్పందించిన జాయింట్ కలెక్టర్, విచారణ జరిపి నివేదిక అందజేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

జేసీ గారి ఆదేశాలతో గుడివాడ డి.ఎస్.పి పి. శ్రీనివాస్ మరియు మచిలీపట్నం డి.ఎస్.పి పర్యవేక్షణలో పమిడిముక్కల పోలీసులు ఎట్టకేలకు శవ పరీక్ష నివేదికను బాధిత కుటుంబానికి అందజేశారు. సకాలంలో స్పందించి న్యాయం చేసిన జాయింట్ కలెక్టర్ గారికి బాధిత కుటుంబం మరియు ఆర్.టి.ఐ. కార్యకర్తలు ధన్యవాదాలు తెలిపారు.

About Author

SSN