విద్యుత్ ఘాతానికి గురై మరణించిన దళిత బాలుడి కుటుంబానికి ₹5 లక్షల ఆర్థిక సహాయం మంజూరు
ఉయ్యూరు/పమిడిముక్కల:
కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం, గురజాడ గ్రామానికి చెందిన దళిత బాలుడు కాండ్రు హర్షవర్ధన్ (12) విద్యుత్ షాక్కు గురై మరణించిన ఘటనలో, బాధితుడి తండ్రి కాండ్రు అభషేలేమ్కు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎ.పి.సి.పి.డి.సి.ఎల్) విజయవాడ చీఫ్ జనరల్ మేనేజర్ పి.సుబ్రహ్మణ్యం ₹5 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఘటన నేపథ్యం
ది.18.08.2025న దళిత బాలుడు కాండ్రు హర్షవర్ధన్ ఆడుకుంటూ షామియానా స్తంభం పట్టుకోవడంతో విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు. అయితే, బాలుడు మరణించి 14 నెలలు కావస్తున్నా పమిడిముక్కల పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు (ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు) ఇవ్వడంలో ఆలస్యం చేయడం వల్ల ఆర్థిక సహాయం మంజూరు కావడంలో జాప్యం జరిగింది.
ఆర్.టి.ఐ కార్యకర్తల కృషి:
ఈ విషయంలో ఆర్.టి.ఐ కార్యకర్తలు జంపాన శ్రీనివాస గౌడ్, బేతపూడి జోగేశ్వరరావులు స్పందించి కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ కి, జాయింట్ కలెక్టర్ఎమ్.నవీన్ కి P.G.R.S (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) లో పలుమార్లు వినతి పత్రాలు సమర్పించారు. వీరి వినతుల ఫలితంగానే ఈ ఆర్థిక సహాయం మంజూరైంది.
విద్యుత్ ఘాతానికి గురై మరణించిన ఏ సందర్భంలోనైనా బాధితుల వారసులకు ₹5 లక్షల పరిహారం మంజూరు చేయాలని జస్టిస్ పి. లక్ష్మణరెడ్డి ఉత్తర్వులు, ఏపీ ఇఆర్సి మార్గదర్శకాల మేరకు ఈ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన ఆర్థిక సహాయ మంజూరు ఉత్తర్వులను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ P.G.R.S హాల్లో బాలుడి తండ్రి కాండ్రు అభషేలేమ్కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ ప్రతినిధులు జంపాన శ్రీనివాస గౌడ్, బేతపూడి జోగేశ్వరరావులు, ఆర్.టి.ఐ కార్యకర్తలు పాల్గొన్నారు.

