MachilipatnamLocal News
April 3, 2026
జిల్లా

‘స్వచ్ఛాయుధం’ – ‘స్వచ్ఛ యోధులు’తో ప్లాస్టిక్ రహిత నగర నిర్మాణానికి శ్రీకారం –– జిల్లా కలెక్టర్

  • April 3, 2026
  • 1 min read
[addtoany]
‘స్వచ్ఛాయుధం’ – ‘స్వచ్ఛ యోధులు’తో ప్లాస్టిక్ రహిత నగర నిర్మాణానికి శ్రీకారం –– జిల్లా కలెక్టర్
మచిలీపట్నం: 
 
మచిలీపట్నం నగరాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల రహితంగా, శుభ్రంగా, పచ్చదనంతో నింపిన ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు.
 
ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు జిల్లా కలెక్టర్ శుక్రవారం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని రహదారులు భవనాలు శాఖ అతిథి గృహం సమీపంలోని ఎన్జీఓస్ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొని, ‘స్వచ్ఛాయుధం’ అనే సాధనం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన, పచ్చదనంతో నిండిన నగరాన్ని నిర్మించగలమని అన్నారు. మచిలీపట్నం నగరాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలను సులభంగా ఏరేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఒక సాధనాన్ని పరిచయం చేశారు. కింద భాగంలో చిన్న మేకు అమర్చిన కర్రను స్వచ్ఛాయుధంగా పిలుస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా రోడ్లు, వీధులు, ప్రజా ప్రదేశాల్లో పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను సులభంగా సేకరించవచ్చని పేర్కొన్నారు.
 
అలాగే, తమ ప్రాంతంలో ప్రతిరోజూ 15 నుంచి 30 నిమిషాల పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారిని ‘స్వచ్ఛ యోధులు’గా గుర్తించనున్నట్లు తెలిపారు. సమాజం కోసం సేవా దృక్పథంతో ముందుకు వచ్చే యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం మచిలీపట్నంలో ప్లాస్టిక్ లిట్టరింగ్‌ను తగ్గించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, అలాగే మున్సిపల్ సిబ్బంది డ్రైన్ క్లీనింగ్, కమర్షియల్ శానిటేషన్ వంటి ఇతర కీలక పనులపై మరింత సమయం కేటాయించేలా చేయడం అని జిల్లా కలెక్టర్ వివరించారు. ప్రజల సహకారంతో నగరాన్ని అందరూ గర్వించేలా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దవచ్చని ఆయన అన్నారు. “మన నగరం – మన బాధ్యత” అనే భావనతో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆసక్తి గల వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పేర్లను నమోదు చేసుకుని ‘స్వచ్ఛ యోధులు’గా సేవలు అందించాలని ఈ సందర్భంగా కోరారు.
 
కార్యక్రమంలో నగర కమిషనర్ బాపిరాజు, సహాయ కమిషనర్ గోపాలరావు, ఎన్నారై డాక్టర్ వడ్లమూడి రాజేంద్ర, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర కన్వీనర్ పి శ్రీరామ్, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *