MachilipatnamLocal News
October 17, 2026
జిల్లా

LIC లో 1996 నోటిఫికేషన్ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపజేయాలి

  • October 14, 2026
  • 1 min read
LIC లో 1996 నోటిఫికేషన్ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపజేయాలి

 * స్థానిక LIC డివిజనల్ కార్యాలయం వద్ద ICEU ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన

 * కేంద్ర ప్రభుత్వం, DFS తక్షణమే స్పందించాలి: ICEU ప్రధాన కార్యదర్శి జి. కిషోర్ కుమార్ డిమాండ్

మచిలీపట్నం:

1996 నియామకాల నోటిఫికేషన్ (హైదరాబాద్, సికింద్రాబాద్) కింద LIC లో 2012 తర్వాత చేరిన ఉద్యోగులందరికీ 1995 ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక LIC డివిజనల్ కార్యాలయం వద్ద ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ICEU) ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా ICEU ప్రధాన కార్యదర్శి జి. కిషోర్ కుమార్ మాట్లాడుతూ… 1996 నోటిఫికేషన్‌లోని నిబంధనల ప్రకారమే నియామకాలు పొందిన ప్రతి ఒక్కరికీ పాత పెన్షన్ వర్తిస్తుందని స్పష్టంగా పేర్కొనబడిందన్నారు. కాబట్టి 1996 నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులందరికీ పాత పెన్షన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సుదీర్ఘ పోరాటం – తెలంగాణ హైకోర్టులో న్యాయపోరాటం

ఈ న్యాయమైన డిమాండ్‌పై ఆల్ ఇండియా ఇన్స్యూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIIEA) గత కొన్ని సంవత్సరాలుగా నిరంతర పోరాటం చేస్తోందని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగిందని, న్యాయపోరాటం కొనసాగుతోందని పేర్కొన్నారు.

అయితే, కేంద్ర ఆర్థిక శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (DFS) ఈ విషయంలో అఫిడవిట్ సమర్పించడంలో తీవ్ర జాప్యం చేస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి అఫిడవిట్ దాఖలు చేసి, సమస్యకు శాశ్వత న్యాయపరమైన పరిష్కారం చూపాలని కోరారు.

OM 57 మరియు సొంత నిధుల అంశం

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆఫీస్ మెమోరాండమ్ (OM 57) ప్రకారం 2004 కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన వారికి పాత పెన్షన్ వర్తిస్తుందని స్పష్టం చేసిందని కిషోర్ కుమార్ గుర్తుచేశారు. ఆ నిబంధనల ప్రకారం 1996 నోటిఫికేషన్ కింద చేరిన LIC ఉద్యోగులు పాత పెన్షన్‌కు సంపూర్ణ అర్హులని చెప్పారు. పైగా, LIC తన సొంత నిధులతోనే పెన్షన్ స్కీమ్‌ను నిర్వహిస్తోందని, కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవచ్చని వివరించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టీచర్లు, ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపజేసిందని, ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని LIC ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు D. వాసు, Y. స్వామినాథ్, ASM. ప్రసాద్, SV. రత్నారావు మరియు ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

About Author

SSN