బందరు మేయర్ పదవి యాదవ సామాజిక వర్గానికి కేటాయించాలి: యాదవ సేవా సంఘం డిమాండ్
* టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి
* పార్టీ ఆవిర్భావం నుంచి యాదవుల మద్దతు మరువలేనిది
మచిలీపట్నం :
బందరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని బీసీలలో బలమైన వర్గమైన యాదవ సామాజిక వర్గానికి కేటాయించాలని బందరు నియోజకవర్గ యాదవ సేవా సంఘం అధ్యక్షులు పల్లపాటి వెంకట్రావు (చినబాబు) తెలుగుదేశం పార్టీ అధినేతను డిమాండ్ చేశారు. మంగళవారం బందరులోని పీకాక్ రెసిడెన్సీలో బందరు నియోజకవర్గ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బందరులో మేయర్ పదవిని బీసీ మహిళకు కేటాయించడం పట్ల ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే, ఆ పదవిని తమ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి యాదవ సామాజిక వర్గం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి అనేక పోరాటాల్లో కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. అయితే, ఆ స్థాయిలో తమ సామాజిక వర్గానికి పార్టీపరంగా తగిన గుర్తింపు దక్కలేదన్నారు. కావున, ఈసారైనా బందరు మేయర్ పదవిని తమ సామాజిక వర్గానికి కేటాయించి, బందరు అభివృద్ధిలో మరింత భాగస్వామ్యం కల్పించాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆయన విజ్ఞప్తి చేశారు.
టీడీపీ స్థాపన తర్వాత మొట్టమొదటి బందరు శాసనసభ్యులుగా తమ సామాజిక వర్గానికి చెందిన బొర్రా వెంకట్ స్వామి సేవలందించారని, తదనంతరం పార్లమెంట్ సభ్యులుగా కేపీ రెడ్డయ్య, మున్సిపల్ చైర్మన్గా బచ్చుల అర్జునుడు పనిచేశారని తెలిపారు. ఆ తర్వాత కాలంలో తమ సామాజిక వర్గానికి పెద్దపీట వేయలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మంచి అవకాశం వచ్చింది గనుక తమకు తగిన న్యాయం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో బందరు నియోజకవర్గ యాదవ సేవా సంఘం నాయకులు బొర్రా శ్రీనివాసరావు, గొరిపర్తి రాము, అరేపు బుడ్డయ్య, దేవబోయిన కృష్ణ, ఎంపరాల సత్యనారాయణ, నీలపాల కృష్ణ, బోయిన సత్యనారాయణ, గంగుల నాంచారయ్య, బోయిన అంతర్వేది, డొక్కు తాతారావు, డొక్కు వెంకటేశ్వరరావు, గొరిపర్తి గోవిందరాజులు, తోట నాంచారయ్య, గడ్డం సుబ్బారావు తదితర సేవా సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

