290 పెంపుడు జంతువులకు ఉచిత రేబీస్ టీకాలు..
జంతువుల ద్వారా వ్యాపించే వ్యాధులపై ప్రజలకు అవగాహన
మచిలీపట్నం:
ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మచిలీపట్నంలోని ప్రాంతీయ పశు వైద్యశాలలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే జూనోటిక్ వ్యాధులపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జంతువుల ద్వారా మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో రేబీస్, బ్రూసెల్లోసిస్, లెప్టోస్పిరోసిస్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ వంటి వ్యాధులు ప్రధానమైనవని తెలిపారు. ఈ వ్యాధుల నివారణకు పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యులను సంప్రదించడం అత్యంత అవసరమని సూచించారు.
ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక టీకాల కార్యక్రమంలో 260 పెంపుడు కుక్కలకు, 30 పిల్లులకు ఉచితంగా రేబీస్ నిరోధక టీకాలు వేశారు. రేబీస్ వ్యాధి నివారణలో టీకాల ప్రాధాన్యతను వివరించిన అధికారులు ప్రతి పెంపుడు జంతువుకు నిర్ణీత కాల వ్యవధిలో టీకాలు వేయించాలని యజమానులకు సూచించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ గ్రంథాలయ చైర్మన్ జి. గోపీచంద్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్, ఎస్‌పీసీఏ సభ్యుడు ఫణి హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. జంతు సంక్షేమం, ప్రజారోగ్యం పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక అధికారి డా. ఎం. శ్రీనివాసరావు, ఉపసంచాలకులు డా. ఎస్. సజ్జా నాగభూషణ బాబు, విశ్రాంత పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారి డా. వీరంకి మధుసూదన్ రావు, ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డా. వీరంకి మధుబాబు, పశువైద్య శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

