నగర సమస్యల పరిష్కారానికి ‘మీ కోసం’ హెల్ప్‌లైన్: మచిలీపట్నం నగరపాలక సంస్థ
మచిలీపట్నం:
మచిలీపట్నం నగర పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ పౌర సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థ ప్రత్యేకంగా “మీ కోసం” విభాగాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు మచిలీపట్నం నగరపాలక సంస్థ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. నగరంలో తాగునీటి సమస్యలు, పరిసరాల అపరిశుభ్రత, కాలువలు శుభ్రం చేయకపోవడం, వీధి దీపాలు వెలగకపోవడం మరియు రోడ్లపై ఆక్రమణలు వంటి పౌర సమస్యలు ఎదురైతే ప్రజలు తక్షణమే 9849907989 ఫోన్ నంబరుకు సంప్రదించాలని అధికారులు కోరారు.
ప్రజల ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కారం కోసం “మీ కోసం” విభాగం సంవత్సరంలో 365 రోజులు, ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు నిరంతరం అందుబాటులో ఉంటుంది. పౌరులు ఫోన్ ద్వారా లేదా నేరుగా వినతిపత్రం సమర్పించడం ద్వారా తమ సమస్యలను నగరపాలక సంస్థ దృష్టికి తీసుకురావచ్చు. దీనితో పాటు ప్రజల సౌకర్యార్థం మున్సిపల్ రెవెన్యూ కౌంటర్లు కూడా ఏడాది పొడవునా ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు భోజన విరామ సమయంలోనూ నిరంతరాయంగా పనిచేస్తాయి. ఆస్తి పన్ను, ఖాళీ స్థలముల పన్ను మరియు వాటర్ ఛార్జీలు మొదలైన చెల్లింపులను ఈ కౌంటర్లలో చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ విజ్ఞప్తి చేసింది.

