ముగిసిన యోగ పోటీలు…
మచిలీపట్నం:
యోగాంద్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నేతృత్వంలో వివిధ రకాల యోగా పోటీలు నేటితో విజయవంతంగా ముగిశాయి. ఈనెల 7 తేదీ నుండి గ్రామస్థాయిలో, 10వ తేదీ నుండి మండల స్థాయిలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగ పోటీలు నిర్వహించారు. ఈనెల 14 తేదీన మొదలైన జిల్లా స్థాయి పోటీలు 16వ తేదీ మంగళవారంతో ముగిశాయి. జిల్లా స్థాయిలో నగరంలోని జెడ్పీ కన్వెన్షన్ హాలులో జూనియర్లు, యువతీ యువకులు, వయోవృద్ధుల విభాగాలలో యోగా పోటీలు నిర్వహించారు.
మూడవ రోజు జిల్లా స్థాయి పోటీలలో యోగా పాటలు, నినాదాలు,వ్యాసరచన, ఛాయాచిత్రాలు, క్విజ్ అంశాలపై జూనియర్, సీనియర్ల విభాగాలలో పోటీలు నిర్వహించారు. యోగ పోటీలు పాటల అంశంలో జూనియర్ భాగంలో యు రామకుమారి, సీనియర్ల విభాగంలో ముదిగొండ శాస్త్రి విజేతలుగా నిలిచారు. నినాదాలు అంశంలో జూనియర్ల విభాగంలో బి ప్రత్యూష, వ్యాసరచన అంశంలో జూనియర్ల విభాగంలో ఎన్ సరిత, ఛాయాచిత్రాల అంశంలో జూనియర్ విభాగంలో పి నాగమణి, క్విజ్ అంశంలో జూనియర్ విభాగంలో యు రామకుమారి విజేతలుగా ఎంపికయ్యారు. అన్ని అంశాలలోనూ సీనియర్ విభాగంలో ముదిగొండ శాస్త్రి ప్రతిభ చూపి విజేతగా నిలవడం చెప్పుకోదగ్గ విశేషం.
ఈ యోగా పోటీలకు న్యాయ నిర్ణయితలుగా జి కృష్ణ, మద్దాల చింతయ్య, ఎన్ వి ఆర్ భాష్యం, యు. కార్తీక్, ఆర్ డి ప్రసాద్ వ్యవహరించారు. యోగా పోటీలను ఆయుష్ అధికారులు డాక్టర్ వాహిని, డాక్టర్ మానస, డాక్టర్ సుమిత్ర, డాక్టర్ రత్నకుమారి పర్యవేక్షించారు.

