మచిలీపట్నం బి.సి. వెల్ఫేర్ హాస్టల్లో దోమతెరల పంపిణీ
మచిలీపట్నం:
స్థానిక వలందపాలెంలోని బి.సి. వెల్ఫేర్ బాలుర హాస్టల్లో సోమవారం విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా దోమతెరల పంపిణీ కార్యక్రమం జరిగింది. పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్‌తో పాటు ఏ ఎన్.ఎమ్ మరియు ఆశా కార్యకర్తలు పాల్గొని విద్యార్థులకు దోమతెరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వైద్యాధికారులు మరియు సిబ్బంది మాట్లాడుతూ… మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి దోమల వల్ల వ్యాపించే ప్రమాదకర వ్యాధుల నుండి రక్షణ పొందేందుకు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా రాత్రి వేళల్లో దోమతెరలను ఉపయోగించాలని సూచించారు. హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణించగలరని, ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే హెల్త్ అసిస్టెంట్ లేదా ఏ ఎన్.ఎమ్ దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బి.సి. హాస్టల్ సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

