పరిసరాల పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధుల నివారణ: వర్రెగూడెం UPHC పరిధిలో ‘ఫ్రైడే – డ్రై డే’, ఫీవర్ సర్వే
మచిలీపట్నం:
పరిసరాల పరిశుభ్రతను పాటిస్తేనే డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని, దోమల నివారణ మరియు ప్రజల ఆరోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆరోగ్య శాఖ సిబ్బంది పేర్కొన్నారు. శుక్రవారం ‘ఫ్రైడే – డ్రై డే’ కార్యక్రమంలో భాగంగా వర్రెగూడెం UPHC పరిధిలో అధికారులు, సిబ్బంది కలసి ఇంటింటికీ వెళ్లి ప్రత్యేక అవగాహన కార్యక్రమం మరియు ఫీవర్ సర్వే నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ సిబ్బంది మాట్లాడుతూ… ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. ముఖ్యంగా ఇళ్ల ప్రాంగణాల్లో పడేసిన కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, వాడని ప్లాస్టిక్ వస్తువుల్లో నీరు చేరితే దోమల లార్వా ఉత్పత్తి పెరుగుతుందని, అటువంటి వాటిని వెంటనే తొలగించాలని సూచించారు.
అలాగే కాలనీలో ప్రతి ఇంటికీ తిరుగుతూ హౌస్ టూ హౌస్ ఫీవర్ సర్వే చేపట్టారు. జ్వరం బాధితుల వివరాలను సేకరించి వారికి తగిన వైద్య సలహాలు, సూచనలు అందజేశారు. శరీరంలో జ్వరం లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ సూపర్‌వైజర్లు బి. రాఘవేంద్రరావు, భట్రాజు సూరిబాబు, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఏఎన్‌ఎం రాజశ్రీ, ఆశా కార్యకర్త జయమ్మ మరియు ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

